సర్పంచ్ పోరుకు కన్నతల్లితోనే పోటీ.. నామినేషన్ దాఖలు చేసిన తల్లీకూతుళ్లు
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లిలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సర్పంచ్ స్థానానికి తల్లీకూతుళ్లు పోటీకి దిగారు. తల్లి గంగవ్వ, కూతురు పల్లెపు సుమ నామినేషన్ దాఖలు చేశారు. తిమ్మయ్యపల్లి సర్పంచ్ స్థానం బీసీ మహిళ రిజర్వ్ చేశారు. పల్లెపు సుమ అదే గ్రామానికి చెందిన అశోక్‌ను 2017లో ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో ఇరు కుటుంబ మధ్య కలహాలు మొదలయ్యాయి. మొన్నటి వరకు సుమ తండ్రి గ్రామ సర్పంచ్‌గా పోటీ చేశారు. తల్లికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపగా కూతురుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. మొత్తం ఓట్లు 506 ఉండగా ఎనిమిది వార్డులు ఉన్నాయి. సర్పంచ్ స్థానానికి మొత్తం నలుగురు పోటీ చేస్తుండగా తల్లి, కూతురు మధ్య ప్రధాన పోటీ నెలకొంది.
ఓటర్ల జాబితా సవరణకు 7 రోజులు పొడిగింపు..
భారత ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. రాబోయే ఎన్నికల దృష్ట్యా, ఓటర్ల జాబితాలో తమ పేర్లు సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధరించుకోవడానికి ప్రజలకు మరింత సమయం కల్పిస్తూ 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రత్యేక ఓటర్ సవరణకు అవకాశం కల్పిస్తూ వారం రోజులు గడువును పొడిగించింది. ఈ గడువు పొడిగింపు అండమాన్- నికోబార్ దీవులు, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లకు వర్తిస్తుంది.
ఒక హిడ్మాను చంపితే వెయ్యి మంది హిడ్మాలు పుట్టుకొస్తారు..
సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతా తెలివి తేటలు ఉన్న ఇమ్మడి రవి అలా మారడానికి కారణం ఈ వ్యవస్థ లే.. ఐ బొమ్మలో సినిమాలను ఫ్రీగా నేను కూడా చూశానని తెలిపారు. ఆరేడు వందలు పెట్టి ఎలా చూసేది అని చూశాను.. వ్యవస్థలో లోపాలను సరి చేయకుంటే ఇలాంటి రవిలే పుట్టుకు వస్తారని చెప్పుకొచ్చారు. ఒకరు మంచి చేస్తే మరొకరు చెడు చేస్తారు అని సీపీఐ నారాయణ చెప్పుకొచ్చారు. ఇక, ఒక హిడ్మాను చంపితే వెయ్యి మంది హెడ్మాలు పుడుతారు అని నారాయణ పేర్కొన్నారు. అలానే ఒక బొమ్మ రవిని చంపితేనో, జైల్లో వేస్తేనో మరో 100 మంది వస్తారని తెలిపారు. ఐ బొమ్మ రవినీ ఉరి తీస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు.. సినిమా మాఫియాను ఉరి తీస్తే సమాజానికి ఉపయోగం ఉంటుంది అన్నారు. కోట్లు ఖర్చు పెట్టి టికెట్ ధరల కోసం ఆడుక్కుంటారని విమర్శించారు. సామాన్య ప్రజలను దోచుకోవడానికి ఈ ప్రభుత్వం సహాయం చేస్తుందా? అని అడిగారు.
ముంబై పర్యటనకు మంత్రి దుర్గేష్.. ఫిల్మ్ టూరిజంలో పెట్టుబడులే లక్ష్యంగా..
ఏపీ సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ డిసెంబర్ 1, 2వ తేదీల్లో ముంబైలో పర్యటించనున్నారు. ముంబైలోని జుహూలో ఉన్న జేడబ్ల్యూ మారియట్ హోటల్ లో జరగనున్న 12వ సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ -2025కు హాజరు కానున్నారు. ప్రస్తుత ఏఐ యుగంలో మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగం యొక్క భవిష్యత్తు వృద్ధికి రోడ్‌మ్యాప్‌ను రూపొందించే ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొని కీలకోపన్యాసం చేయనున్నారు ఆయన. భారతీయ మీడియా & ఎంటర్టైన్మెంట్ రంగాన్ని $100 బిలియన్ల భవిష్యత్తు వైపు నడిపించేందుకు ఏపీ ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని మంత్రి దుర్గేష్ స్పష్టం చేయనున్నారు.
అఖండ 2 సెన్సార్ క్లియర్.. వైలెన్స్ ఉన్నా U/A రావడానికి కారణం ఇదే
నందమూరి బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2: తాండవం’ విడుదలకు చివరి అడ్డంకి కూడా తోలగ్గిపోయింది. డిసెంబర్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, అధికారికంగా యూ/ఏ సర్టిఫికెట్‌ను పొందింది. బోయపాటి సినిమాల్లో సాధారణంగా ఉండే వైలెన్స్ డోస్ ఎక్కువ ఉంటుందని అందరికీ తెలుసు. కానీ ఈసారి డివోషనల్ టచ్, భావోద్వేగాలు, మాస్ హైప్ మధ్య బ్యాలెన్స్‌ను బాగా కాపాడినందువల్లే యాక్షన్ సీన్స్ ఉన్నా U/A రావడానికి అవకాశం ఇచ్చిందని టాక్ వినిపిస్తోంది. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలకు వైలెన్స్ ఎక్కువైతే A సర్టిఫికెట్ వస్తుంది, ‘అఖండ 2’కు U/A రావడం ఇండస్ట్రీలోనే చిన్న సంచలనంగా మారింది. ముఖ్యంగా అఘోరా గెటప్‌లో బాలయ్య విలన్లపై జరిపే యాక్షన్ సీన్స్ ఉన్నప్పటికీ, బోయపాటి వైలెన్స్ డోస్‌ను నియంత్రిస్తూ కథకు అవసరమైన భావోద్వేగాలకు, భక్తి రసానికి ప్రాధాన్యం ఇవ్వడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణం అని చెప్పాలి.
ఆసుపత్రి పార్కింగ్‌లో బీభత్సం.. విధ్వంసం సృష్టించిన బోలెరో..!
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలో ఉన్న హనుమాన్ ప్రసాద్ పోద్దార్ క్యాన్సర్ ఆసుపత్రిలో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా గందరగోళ వాతారవరం ఏర్పడింది. దీనికి కారణం.. వేగంగా వచ్చిన ఓ బోలెరో వాహనం అదుపు తప్పి ఆసుపత్రి పార్కింగ్‌లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో పార్కింగ్‌లో నిలిపి ఉంచిన 16 వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో కొందరు వ్యక్తులు తమ బైక్‌ల పక్కన నిలబడి ఉన్నారు. అయితే వారు ప్రమాదాన్ని అంచనా వేసి సమయానికి పక్కకు తప్పుకోవడంతో ప్రాణాపాయం తప్పింది.
హిట్ మ్యాన్ దెబ్బ.. రికార్డులు అబ్బా.. అత్యధిక సిక్సర్ల ప్రపంచ రికార్డు బద్దలు!
రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో నేడు జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికాపై మూడు భారీ సిక్సర్లు కొట్టి రోహిత్ శర్మ వన్డే చరిత్రలో అత్యధిక సిక్సర్ల ప్రపంచ రికార్డును అధిగమించాడు. దీనితో పాకిస్తాన్‌కు చెందిన షాహిద్ అఫ్రిదీ రికార్డును బద్దలు కొట్టాడు. దక్షిణఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ మేరకు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. మొదట్లో జైస్వాల్ తక్కువ పరుగులకే వెనుతిరిగినా.. రోహిత్, కోహ్లీలు వారి భారీ హిట్టింగ్ తో భారత జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు.
సిలిగురి కారిడార్‌లో కొత్త సైనిక స్థావరాలు.. బంగ్లా, పాక్, చైనాలకు గట్టి మెసేజ్..
గతేడాది హింసాత్మక నిరసనల నేపథ్యంలో షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు. మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్‌కు తాత్కాలిక పాలకుడిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, అప్పటి నుంచి బంగ్లా ప్రభుత్వం భారత వ్యతిరేక వైఖరిని అవలంభిస్తూనే ఉంది. పాకిస్తాన్, చైనాతో అంటకాగుతూ భారత్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. ఇటీవల, పాక్-బంగ్లాల మధ్య రక్షణ, వ్యాపార-వాణిజ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. ముఖ్యంగా, పాక్ సైనికాధికారులు, ఐఎస్ఐ అధికారులు తరుచుగా బంగ్లాదేశ్‌లో పర్యటించడం భారత్‌ను కలవరపెడుతోంది.
చుక్కేసి చిక్కితే.. చిక్కులే !
మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాల కారణంగా.. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపైన ట్రాఫిక్ పోలీసులు, కోర్టులు కొరడా జులిపిస్తున్నాయి. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. ఈ డ్రైవ్‌లో భాగంగా మొత్తం 431 మందిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. వీరిలో 325 ద్విచక్ర వాహనదారులు, 16 ఆటోలు, 86 కార్లు, 4 భారీ వాహనదారులపై కేసులు నమోదయ్యాయి. బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ (బిఎసి) ఆధారంగా కేసులను వర్గీకరిస్తే.. 378 మంది 35 mg/100 ml నుంచి 200 mg/100 ml మధ్య, 42 మంది 201 mg/100 ml నుంచి 300 mg/100 ml మధ్య, 11 మంది 301 mg/100 ml నుంచి 550 mg/100 ml మధ్య ఆల్కహాల్ సేవించి పట్టుబడ్డారు.
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. 37 మంది లొంగుబాటు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీకి మరోసారి గట్టి దెబ్బ తగిలింది. దక్షిణ బస్తార్ ప్రాంతానికి చెందిన మొత్తం 37 మంది మావోయిస్టులు అధికారుల ముందు లొంగిపోయారు. దంతేవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ సమక్షంలో ఈ లొంగుబాట్లు నమోదయ్యాయి. లొంగిపోయిన వారిలో 27 మంది క్రియాశీల మావోయిస్టులు ఉండటం విశేషం. వీరిలో పలువురిపై మొత్తం 65 లక్షల రూపాయల రివార్డులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే మరో 10 మంది మిలీషియా సభ్యులు కూడా ఆయుధాలు వదిలి ప్రభుత్వ విధానాలకు మద్దతు తెలుపుతూ లొంగిపోయారు. దక్షిణ బస్తార్‌లో మావోయిస్టుల ప్రాబల్యం గత కొంతకాలంగా తగ్గుముఖం పడుతుండగా, ఈ భారీ లొంగుబాటు ఆ ప్రక్రియకు మరింత వేగం తీసుకొచ్చిందని అధికారులు పేర్కొన్నారు. లొంగిపోయిన మిలీషియా సభ్యులు గతంలో పలు కీలక సంఘటనల్లో చురుకుగా పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. వీరు గోంపడ్, జంగంపాల్, గుడ్రూమ్ పరిసర ప్రాంతాల్లో మావో చట్రవృత్తుల్లో పాల్గొంటూ భద్రతాబలగాల కదలికలను గమనించడం, 2019, 2020ల్లో పోలీసులు, భద్రతా బలగాలపై దాడులు, కాల్పులు, అలాగే IEDలు అమర్చడం వంటి ఘటనల్లో ప్రమేయం ఉన్నట్లు విచారణలో తేలింది.