కరోనా తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొనడంతో తిరుమలలో శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం సమకూరుతోంది. ఈ ఏడాది మార్చి నుంచి ప్రతి నెలా రూ.100 కోట్లకు పైగానే టీటీడీకి శ్రీవారి హుండీ ద్వారా ఆదాయం వచ్చి చేరుతోంది. మే నెలలో తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.129.93 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. జూన్ నెల పూర్తి కాకుండానే రూ.100 కోట్ల మార్కును దాటిందని.. జూన్ 1 నుంచి 26 వరకు రూ.106 కోట్ల వరకు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు . అయితే గడిచిన రెండేళ్లలో శ్రీవారి దర్శనానికి పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించడంతో ఆ కాలంలో హుండీ ఆదాయం బాగా తగ్గింది.
ప్రస్తుతం ప్రతినెలా భారీగానే తిరుమల శ్రీవారి హుండీకి ఆదాయం వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వార్షిక ఆదాయం రూ.1,500 కోట్లు దాటుతుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో ఏడాదికి రూ.1,200 కోట్ల వరకూ హుండీ ఆదాయం లభించేది. వేసవి సెలవుల కారణంగా మే, జూన్ నెలల్లో హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్కు దాటేది. మిగిలిన నెలల్లో మాత్రం రూ.100 కోట్ల లోపే ఉండేది. ఈ ఏడాది మాత్రం తిరుమలకు భారీ ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. వీకెండ్‌లలోనే కాకుండా సాధారణ రోజుల్లో రద్దీ నెలకొంటోంది. కాగా తిరుమలలో ప్రతిరోజూ హుండీ ద్వారా రూ.4 కోట్ల ఆదాయం నమోదవుతోంది.