East Godavari: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం వద్ద కెమికల్ ఫ్యాక్టరీలో మంగళవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలోని ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. విజన్ డ్రగ్స్ పరిశ్రమలో ఇథైల్ కాలమ్ గొట్టంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలో మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా కెమికల్ ట్యాంకర్ పేలింది. ఈ ఘటనలో చాగల్లుకు చెందిన మహీధర్ ముసలయ్య, తాజ్యంపూడి వాసి రత్నబాబు, గౌరీపట్నంకు చెందిన సత్యనారాయణ అనే ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడగా.. వారిని కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అధికారులు అప్పగించారు.
Read Also: YS Jagan Mohan Reddy: ఈ ఒక్క ఎన్నికల్లో గెలిస్తే… 30 ఏళ్ల పాటు మనమే ఉంటాం..!
కాగా ఘటనా స్థలిని అధికారులతో పాటు పోలీసులు పరిశీలించి ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తులో కొన్ని ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు. జాయింట్ కలెక్టర్ శ్రీధర్, ఇంఛార్జి ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి, కొవ్వూరు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పరిశ్రమను సందర్శించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు కొవ్వూరు ప్రభుత్వాస్పత్రిలో బాధితుల కుటుంబాలను హోంమంత్రి తానేటి వనిత పరామర్శించి ధైర్యం చెప్పారు. కాగా బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అయితే ఇటీవల గోదావరి జిల్లాలలో వరుసగా పలు పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రజలు ఆందోళన పడుతున్నారు. నెల రోజుల క్రితం కాకినాడలోని ఓ షుగర్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి ఐదుగురు కార్మికులు మరణించారు. నాలుగు రోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి ముగ్గురు మృతి చెందారు.