శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో గురువారం నాడు హుండీలను లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ట బందోబస్తు మధ్య సిబ్బంది, శివసేవకులు ఉభయ దేవాలయాలతో పాటు నిత్యాన్నదానం హాలులోని హుండీలను లెక్కించారు. గత 27 రోజులుగా స్వామి, అమ్మవార్లకు రూ.3,09,52,777 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో లవన్న తెలిపారు. అంతే కాకుండా 267 గ్రాముల బంగారం, ఐదు కిలోలకు పైగా వెండి ఆభరణాలు, 323 యూఎస్ డాలర్లు, 197 సౌదీ రియాల్స్, 137 కెనడా డాలర్లు, 40 ఆస్ట్రేలియా డాలర్లను భక్తులు కానుకల రూపంలో హుండీలో సమర్పించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
మరోవైపు శ్రీశైలం మహా క్షేత్రంలో రుద్రమూర్తికి ఆరుద్ర నక్షత్ర పూజలు గురువారం ఘనంగా జరిగాయి. రుద్రవనంలో గత ఏడాది శంకర జయంతి రోజున ప్రతిష్టించిన 14 అడుగుల ఎత్తు గల రుద్రమూర్తికి శాస్ర్తోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఈవో లవన్న తెలిపారు. రుద్ర దేవుని చల్లని చూపు కృష్ణానదిపై ఎప్పుడూ పడుతూ ఉండాలని నదికి అభిముఖంగా ప్రతిష్టించిన స్వామివారికి అర్చకులు, వేదపండితులు పంచామృతాభిషేకాలు, వివిధ రకాల ఫలోదకాలు, శుద్ధజలాలతో అభిషేకించి మహా బిల్వార్చన, పుష్పార్చనలు నిర్వహించారు.
Weather Update: మరో రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..