ఓవైపు విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వైపు వేగంగా అడుగులు పడుతున్నాయి.. మరోవైపు వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాయి.. ఈ తరుణంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మనివ్వమని స్పష్టం చేసిన ఆయన.. అందరికి ఉద్యోగాలు ఉంటాయి.. స్టీల్ ప్లాంట్‌ను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు.. ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటు వచ్చామన్న ఆయన.. ఇక్కడి వైకాపా నేతలు తుమ్మపాల చక్కర కర్మాగారాన్ని అమ్మేకుండా ఉంటారా..? అంటూ ప్రశ్నించారు.. పాల ఫ్యాక్టరీలు, స్పిన్నింగ్ మిల్లులు అమ్మేస్తున్న ఎవ్వరు మాట్లాడం లేదని.. వాటిని అమ్మకుండా చూడాలని డిమాండ్ చేశారు.
మరోవైపు.. పోలవరం నిర్వాసితుల గోడును ప్రభుత్వం పట్టించుకోవాలన్నారు సోము వీర్రాజు.. వరద ముంపు వల్ల ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవాలన్న ఆయన.. కేంద్రం నిధులు ఇస్తున్నా.. పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యం ఎందుకు అవుతోంది? అని ప్రశ్నించారు.. రూ.4,100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తే నిర్వాసితులు సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆయన.. ఇన్ని కోట్లు పథకాలు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితుల కోసం ఎందుకు ఖర్చు చేయలేదని ప్రశ్నించారు. నిర్వాసితుల ప్రాంతాల్లో తమలపాకు లాంటి రోడ్లు వేశారు… పడవలో తిరిగే ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చారని ఆరోపించారు. రాష్ట్ర నీటి వనరులు మీద విజయవాడలో నిపుణులుతో ఒక చర్చా కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు సోము వీర్రాజు.