Somu Veerraju: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఏలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రామాలు అభివృద్ది చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ సర్పంచులకు నిధులు పెంచారన్నారు. అయితే కేంద్రం ఇచ్చిన నిధులు సర్పంచులకు ఇవ్వకుండా వాటిని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని సోము వీర్రాజు ఆరోపించారు. అక్టోబర్ 2 నుంచి సర్పంచులకు ఇవ్వాల్సిన నిధుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నామని తెలిపారు. మోదీ ఇచ్చిన నిధులతో రోడ్లు వేస్తున్నారని.. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు జీరో అని.. ఈ అంశంపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. స్థానిక సంస్థలకు ఇస్తున్న నిధులు ఎంతో చెప్పగలరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Read Also:China: ఉద్యోగుల టాయ్‌లెట్లలో సీసీ కెమెరాలు.. అందుకే అలా చేశామంటున్న కంపెనీ
గ్రామాల్లో రోడ్లు వేసే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదని సోము వీర్రాజు విమర్శలు చేశారు. సర్వ శిక్షా అభియాన్ ద్వారా ఇప్పటికే కేంద్రం నుంచి ఏపీకి రూ.80 వేల కోట్లు రాష్ట్రానికి అందాయని.. దానికి నాడు- నేడు ఇలా రకరకాల పేర్లు పెడుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ పొత్తు జనంతో, జనసేనతో మాత్రమే ఉంటుందన్నారు. తొమ్మిది రత్నాలు ఇచ్చామంటూ రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల పాలు చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. పసుపు కుంకుమ పథకానికి 37వేల కోట్లు ఖర్చుపెట్టిన చంద్రబాబు.. టీడ్కో ఇళ్లు ఇవ్వలేకపోయారని సోము వీర్రాజు ఆరోపించారు. కుటుంబ పార్టీలతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. కుటుంబ పార్టీల మూలంగా మైండ్ గేమ్ రాజకీయాలు అమలవుతున్నాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ఎండగట్టి తీరుతామని స్పష్టం చేశారు. చిరంజీవి జనసేనతో కలిసొస్తే తమకు ఆనందమేనని తెలిపారు. 225 ఎమ్మెల్యే సీట్లకు పెరిగినా ఏ ఒక్క ఎమ్మెల్యే స్కూల్, హాస్పిటల్, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లరన్నారు. ఇసుక, మట్టి అమ్ముకోవడం మాత్రమే మన ఎమ్మెల్యే స్థాయి అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సీట్లు పెంచితే ఇవే పార్టీలు వస్తాయని.. ఇంకా అవే అమ్మేసుకోడానికి వస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ-జనసేన అధికారంలోకి వస్తాయని సోము వీర్రాజు జోస్యం చెప్పారు.