China Company Arranged CC Cameras in Toilets: ఉద్యోగుల టాయ్‌లెట్లలో సీసీ కెమెరాలు.. అందుకే అలా చేశామంటున్న కంపెనీచాలామంది టాయ్‌లెట్‌కు వెళ్లి కాస్త ప్రశాంతంగా ఉండాలని భావిస్తారు. కొందరు మొబైళ్లు చూసుకుంటూ పని కానిస్తారు. కానీ టాయ్‌లెట్ విషయంలో కూడా ఓ కంపెనీ విచిత్రంగా ప్రవర్తించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఉద్యోగులు టాయిలెట్‌కు వెళ్లి త్వరగా రావడం లేదని చైనాలోని ఏవియేషన్ లిథియం బ్యాటరీ కంపెనీ టాయిలెట్లో సీసీ కెమెరాలు బిగించింది. ఈ మేరకు బాత్రూమ్ డోర్‌కు టైమర్లు పెట్టి వారి జీతాల్లో ‘వాష్‌రూమ్ లేట్’ అని పేర్కొంటూ కోత విధిస్తోంది. ఉద్యోగుల టాయిలెట్‌లో కూర్చుని ఉన్న ఫొటోలు బయటకు లీక్ కావడంతో ఈ ఉదంతం బయటపడింది. దీనిపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తోంది. గంటలు గంటలు కేఫ్‌లో కూర్చుని బాతాఖానీలు కొడితే కంపెనీ రూల్స్ పెట్టిందంటే అర్ధం ఉంటుంది కానీ ఇలా టాయ్‌లెట్‌లో సీసీ కెమెరాలు పెట్టడమేంటని పలువురు మండిపడుతున్నారు.
Read Also:Bullet Bandi Ashok: బుల్లెట్ బండి దిగి.. ఏసీబీ బండెక్కిన ‘పెళ్లికొడుకు’
అయితే నిత్యం మానవ హక్కుల గురించి, కార్మికుల శ్రేయస్సు గురించి మాట్లాడే కమ్యూనిస్ట్ దేశంలో ఇలాంటి నిబంధనలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయంటూ పలువురు నెటిజన్‌లు కామెంట్ చేస్తున్నారు. ఉద్యోగులను పశువుల కన్నా హీనంగా చూడటం సరికాదని హితవు పలుకుతున్నారు. ప్రభుత్వ యాజమాన్య సంస్థలోనే ఇలాంటి కఠిన నిబంధనలు, దారుణ ఘటనలు వెలుగు చూడటం విచిత్రంగా ఉందని మండిపడుతున్నారు. కాగా చైనాలోని పలు మీడియా సంస్థలు ఈ విషయంపై వివరణ ఇవ్వాలని కంపెనీ యాజమాన్యాన్ని ప్రశ్నించగా.. తమ చర్యను ఏవియేషన్ లిథియం బ్యాటరీ కంపెనీ సమర్థించుకుంది. టాయిలెట్‌లో ఉద్యోగులు సిగరెట్ తాగకుండా, ఫోన్ వాడకుండా కట్టడి చేసేందుకే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వివరణ ఇచ్చింది.