Sajjala Ramakrishna Reddy: అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ కామెంట్లు ఇప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కాకరేపుతున్నాయి.. అయితే, వైసీపీ నేతలు కోటంరెడ్డిపై కౌంటర్ ఎటాక్‌కు దిగుతున్నారు.. తాజా పరిణామాలపై స్పందించారు ప్రభుత్వ సలహాదారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఫోన్ ట్యాపింగ్ అనేదే లేనప్పుడు.. ఇంకా విచారణ అవసరం ఏముంటుంది? అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల వెనుక ఉద్దేశ్యాలు ఎవరివో అందరికీ తెలుసన్న ఆయన.. పార్టీకి సంబంధించిన వివిధ విభాగాలను యాక్టివేట్ చేయటం, పార్టీ నిర్మాణం, ప్రతిపక్షాలు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పి కొట్టడంపై సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమీక్షిస్తున్నారని తెలిపారు.
ఇక, ఫోన్ ట్యాపింగ్ అంశం చంద్రబాబు స్కీం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు సజ్జల.. దీనిలో కోటంరెడ్డి లాంటివాళ్లు పాత్రధారులుగా అభివర్ణించారు. రాజకీయంగా టీడీపీ దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో ఉంది.. అందుకే, లేని విషయాలను ఉన్నట్లు సృష్టించే ప్రయత్నం చేస్తోందంటూ మండిపడ్డారు. ప్రజలకు సంబంధించి మాట్లాడే అంశాలు లేకపోవడంతోనే టీడీపీ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సంబంధించి మేము చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి.. ఇటువంటి చిల్లర అంశాలు పట్టించుకునే టైం మాకు లేదన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.