ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ సినిమా టిక్కెట్ రేట్లను ప్రస్తావించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. జగన్ గురించి తాను ఒకే ఒక్క మాట చెబుతానని.. మీడియా వాళ్లు రెండో ప్రశ్న అడగడానికి వీల్లేదు అంటూ కామెంట్ చేశారు.
సినిమా టికెట్ల ఒక్క విషయమే కాదు అది ఏ విషయమైనా సీఎం జగన్ గురించి ఒకే ఒక్క మాట చెప్తానని.. ఆయన దూరం నుంచి బ్రహ్మ పదార్థంలా కనబడతారు.. కానీ దగ్గరి నుంచి చూస్తే దేవుడి ప్రసాదంలా కనిపిస్తారు అంటూ పోసాని కృష్ణమురళి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తాను ఏడెనిమిది సినిమాల్లో నటిస్తున్నారని పోసాని తెలిపారు. ఏ పని అందుబాటులో ఉంటే.. తాను ఆ పని చేస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం రెండు, మూడు టీవీ షోలు కూడా చేస్తున్నానని పేర్కొన్నారు. తాను ఇప్పటివరకు తిరుమల శ్రీవారి సన్నిధికి ఎన్నిసార్లు వచ్చానో లెక్కలేదన్నారు. ఏపీకి జగన్ లాంటి నాయకుడు ఉండాలని పోసాని అభిప్రాయపడ్డారు.