Pawan Kalyan: ఏపీలో సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు అరెస్టుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులతో జర్నలిస్టులను కట్టడి చేయాలని చూస్తున్నారా అంటూ ట్వి్ట్టర్ వేదికగా ఆయన ప్రశ్నించారు. వర్తమాన విషయాలను పాత్రికేయులు ప్రజలకు అందించేందుకు నిబద్ధతతో పనిచేస్తారని.. వారిని అరెస్టులు చేసి కేసులు నమోదు చేసి కట్టడి చేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉందని పవన్ ఆరోపించారు. జర్నలిస్టును అరెస్ట్ చేయడంలో పోలీసులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించలేదన్నారు. గన్నవరం విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని పాత్రికేయులు ఉండే వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశారని ఆరోపిస్తూ అంకబాబును అరెస్ట్ చేసి కుట్రపూరిత నేరం కింద సెక్షన్‌లు నమోదు చేయడం చూస్తుంటే ప్రభుత్వం ఉలిక్కి పడుతున్నట్లు అర్ధమవుతోందని పవన్ కళ్యాణ్ విమర్శించారు.
Read Also:God Father: చిరు చిత్రం సెన్సార్ పూర్తయింది.. సెన్సార్ టాకేంటంటే..?
సహచర జరల్నిస్టు అరెస్టును ఖండిస్తూ నిరసన తెలిపిన జర్నలిస్టులపైనా కేసులు నమోదు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించడాన్ని పవన్ కళ్యాణ్ ఖండించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను, ప్రభుత్వ వైఫల్యాలను చర్చల ద్వారా ప్రజలకు అందించే జర్నలిస్టులను అరెస్టుల ద్వారా అదుపు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని చురకలు అంటించారు. ఏపీలో సామాన్యులు, మహిళలు, ప్రతిపక్ష పార్టీల వారిపై వైసీపీ వాళ్లు చేసే సైబర్ బుల్లీయింగ్, ట్రోలింగ్ హద్దులు దాటుతున్నా ఈ దాడిపై ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని పవన్ ఆరోపించారు. న్యాయస్థానాలపై, న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులను సైతం వైసీపీ కార్యకర్తలు, వారి ద్వారా లబ్ధి పొందే వ్యక్తులు ఎంతగా కించపరిచారో ప్రజలు మరిచిపోలేదన్నారు. ఈ అంశంపై హైకోర్టు జోక్యం చేసుకుని ఆ విధమైన పోస్టులు చేసిన వారిని అరెస్ట్ చేయమని చెప్పినా పోలీస్ శాఖ మీనమేషాలు లెక్కించిందని.. తూతూమంత్రంగా కొందరిని అరెస్ట్ చేసి మర్యాదలు చేశారని.. ఇప్పటికీ కొంతమందిని అరెస్ట్ చేయలేదని పోలీసులపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు.
అరెస్టులతో జర్నలిస్టులను కట్టడి చేయాలని చూస్తున్నారా? – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/FYWKJYgLm4
— JanaSena Party (@JanaSenaParty) September 23, 2022