God Father: మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమా పరాజయం పాలు కావడంతో మెగా ఫ్యాన్స్ అంతా ఇప్పుడు అక్టోబర్ 5న రాబోతున్న ‘గాడ్ ఫాదర్’ మూవీ మీదనే ఆశలు పెట్టుకున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’కు ఇది రీమేక్ అని తెలియగానే, అలాంటి పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ గతంలో చాలానే వచ్చాయి కదా! అనే భావన వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను రీమేక్స్ కింగ్ అయిన మోహన్ రాజాకు అప్పగించగానే.. అతను సమ్ థింగ్ స్పెషల్ గా దీనిని తెరకెక్కిస్తాడనే నమ్మకం కలిగింది. నయనతారతో పాటు బాలీవుడ్ బాద్ షా సల్మాన్ ఖాన్ కూడా ఇందులోకి ప్రవేశించే సరికీ ఊహించని క్రేజ్ ఏర్పడింది. దానికి తోడు ఇటీవల విడుదలైన ప్రచార చిత్రాలూ సోషల్ మీడియాలో బాగానే హల్చల్ చేస్తున్నాయి. తాజాగా శుక్రవారం ‘గాడ్ ఫాదర్’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. దీనికి ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. అంతేకాదు.. సినిమా అద్భుతంగా వుందని సెన్సార్ బోర్డ్ సభ్యులు చిత్ర యూనిట్ పై ప్రశంసల జల్లు కురిపించారని తెలుస్తోంది. సెన్సార్ సభ్యుల ప్రశంసలు యూనిట్ సభ్యులలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించిందని అంటున్నారు.
ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘గాడ్ ఫాదర్’ ను ముందు అనుకున్న విధంగానే తెలుగు, హిందీ భాషల్లో అక్టోబర్ 5న దసరా కానుకగా విడుదల చేస్తున్నామని నిర్మాతలలో ఒకరైన ఎన్.వి. ప్రసాద్ తెలిపారు. భారతీయ చిత్ర పరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్స్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేయడం ఖాయమని మరో నిర్మాత ఆర్.బి. చౌదరి చెప్పారు. కొణిదెల సురేఖ సమర్పకురాలిగా వ్యవహరిస్తున్న ‘గాడ్ ఫాదర్’కు మాస్టర్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా కెమెరా హ్యాండిల్ చేస్తుండగా, సురేష్ సెల్వరాజన్ ఆర్డ్ డైరెక్షన్ చేశారు. ఎస్.ఎస్. థమన్ సంగీతాన్ని సమకూర్చారు.