Penguins: ప్రస్తుతం సోషల్ మీడియాలో పెంగ్విన్ల గురించి జోరుగా చర్చ నడుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్ ఇలా ఏ సోషల్ మీడియా ఖాతాలను ఓపెన్ చేసినా.. పెంగ్విన్‌ల వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఒకే ఒక్క ఒంటరి పెంగ్విన్ గురించి మాత్రమే చర్చ నడుస్తోంది. కానీ.. అన్ని పెంగ్విన్‌లు ప్రమాదంలో పడుతున్నాయి. మరి కొన్ని ఏళ్లలో వీటిని మన పుస్తకాలలో మాత్రమే చూడాల్సిన పరిస్థితి రావొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటార్కిటికా అంటే ఎప్పుడూ మంచు, చలి, నిశ్శబ్దం అనుకుంటాం. కానీ ఇప్పుడు అక్కడ వాతావరణం వేడెక్కుతోంది. ఆ మార్పు పెంగ్విన్ల జీవితాన్ని పూర్తిగా మార్చేస్తోంది. ఇటీవల వచ్చిన ఓ అధ్యయనం ప్రకారం.. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల అంటార్కిటికా పెంగ్విన్లు మునుపటి కంటే చాలా ముందుగానే పిల్లలు పెట్టడం మొదలుపెట్టాయి. ఇది వినడానికి చిన్న మార్పులా అనిపించినా, పెంగ్విన్ల భవిష్యత్తుకు మాత్రం పెద్ద ముప్పుగా మారింది. 2012 నుంచి 2022 మధ్య కాలంలో పెంగ్విన్లు పిల్లలు పెట్టే ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సగటున 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని ప్రభావంగా మూడు రకాల అడెలీ, చిన్‌స్ట్రాప్, జెంటూ పెంగ్విన్లు దాదాపు రెండు వారాలు ముందుగానే తమ జీవచక్రాన్ని ప్రారంభిస్తున్నాయి. అంటే గుడ్లు పెట్టడం, పిల్లలు పుట్టడం అన్నీ ముందే జరుగుతున్నాయి. ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త ఇగ్నాసియో జువారెజ్ మార్టినెజ్ మాట్లాడుతూ.. “పెంగ్విన్లు ఇంత వేగంగా తమ జీవన అలవాట్లు మార్చుకోవడం మేమెప్పుడూ చూడలేదు. వెన్నెముక ఉన్న జంతువుల్లో ఇది రికార్డు స్థాయి మార్పు. పిల్లలు బతకాలంటే సరైన సమయంలో సరైన ఆహారం దొరకాలి. అదే ఇప్పుడు సమస్యగా మారుతోంది” అని చెప్పారు.
READ MORE: Mana Shankara Varaprasad Garu : రెండో వీకెండ్‌లోనూ..‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డు బుకింగ్స్!
ఇంతకు ముందు యూరప్‌లో ఉండే చిన్న పక్షి అయిన గ్రేట్ టిట్‌పై చేసిన అధ్యయనంలో ఇలాంటి రెండు వారాల మార్పు రావడానికి 75 సంవత్సరాలు పట్టిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. కానీ పెంగ్విన్ల విషయంలో అదే మార్పు కేవలం 10 ఏళ్లలోనే జరిగిపోయింది. ఇది పరిస్థితి ఎంత వేగంగా మారుతోందో చెబుతోంది. శాస్త్రవేత్తలు 2011 నుంచి 2021 మధ్యకాలంలో రిమోట్ కెమెరాల సహాయంతో డజన్ల కొద్దీ పెంగ్విన్ కాలనీలను గమనించారు. ప్రతి గంటకు ఫోటోలు తీసేలా కెమెరాలు అమర్చారు. ఈ పరిశోధనలో మూడు రకాల పెంగ్విన్లు అన్నీ ‘బ్రష్ టెయిల్డ్’ జాతికి చెందినవే. అంటే వీటి తోకలు మంచుపై జారుతూ కనిపిస్తాయి. అడెలీ పెంగ్విన్లు కార్టూన్‌లా కనిపించే కళ్లతో, చిన్‌స్ట్రాప్ పెంగ్విన్లు ముఖంపై నల్ల గీతతో, జెంటూ పెంగ్విన్లు వేగంగా ఈదే స్వభావంతో ప్రసిద్ధి చెందాయి. వాతావరణ మార్పు వల్ల ఈ మూడు జాతుల్లో కొన్నింటికి లాభం, కొన్నింటికి నష్టం జరుగుతోంది. అడెలీ, చిన్‌స్ట్రాప్ పెంగ్విన్లు ఎక్కువగా క్రిల్ అనే చిన్న సముద్ర జీవుల మీదే ఆధారపడతాయి. జెంటూ పెంగ్విన్లు మాత్రం రకరకాల ఆహారం తింటాయి. గతంలో ఈ మూడు జాతులు వేర్వేరు సమయాల్లో పిల్లలు పెట్టేవి. అందుకే ఆహారం కోసం పోటీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు జెంటూ పెంగ్విన్లు మిగతా రెండింటికంటే వేగంగా ముందుకు జరగడంతో అన్నీ ఒకే సమయానికి పిల్లలు పెట్టడం మొదలైంది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. జెంటూ పెంగ్విన్లు ఎక్కువగా వలస వెళ్లవు. అవి ఆహారం కోసం మరింత దూకుడుగా ప్రవర్తిస్తాయి. గూళ్లు వేసుకునే విషయంలోనూ అవే ముందుంటాయి. ఫలితంగా అడెలీ, చిన్‌స్ట్రాప్ పెంగ్విన్లు వెనక్కి నెట్టేస్తాయి. ఒకప్పుడు అడెలీ పెంగ్విన్లు కనిపించిన చోట్ల ఇప్పుడు జెంటూ గూళ్లు కనిపిస్తున్నాయని పరిశోధకురాలు ఫియోనా సట్ల్ చెబుతున్నారు. ఇది కేవలం కళ్లతో చూసిన మార్పే కాదు, డేటా కూడా అదే చెబుతోందట.
READ MORE: iPhone Airపై బిగ్ డిస్కౌంట్.. రూ.24,000 తగ్గించిన iNvent స్టోర్
చిన్‌స్ట్రాప్ పెంగ్విన్ల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా తగ్గిపోతోందని మార్టినెజ్ చెప్పారు. ఈ వేగం కొనసాగితే శతాబ్దం చివరికి ఈ జాతి అంతరించిపోవచ్చని అంచనాలు ఉన్నాయి. అడెలీ పెంగ్విన్లు కూడా అంటార్కిటికా ద్వీపకల్పంలో తీవ్రంగా తగ్గిపోతున్నాయి. అక్కడ నుంచి పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఈ మార్పులకు కారణం ఏమిటంటే… పశ్చిమ అంటార్కిటికా వేగంగా వేడెక్కడం. భూమిపై ఆర్కటిక్ తర్వాత అత్యంత వేగంగా వేడెక్కుతున్న ప్రాంతం ఇదే. ఉష్ణోగ్రత పెరగడంతో సముద్రపు మంచు తగ్గిపోతుంది. మంచు తగ్గితే, వసంత కాలంలో సూక్ష్మ జీవులు ముందుగానే పెరుగుతాయి. దాంతో ఫైటోప్లాంక్టన్ అనే చిన్న మొక్కలు విపరీతంగా పెరుగుతాయి. అవే క్రిల్‌కు ఆహారం. క్రిల్ పెరిగితేనే పెంగ్విన్లకు ఆహారం దొరుకుతుంది. కానీ ఈ మొత్తం ప్రక్రియ ముందే జరుగుతుండడంతో, పిల్లలు పుట్టే సమయానికి సరిపడా ఆహారం దొరకకపోవచ్చు. దీనికి తోడు, వాణిజ్య మత్స్యకారులు ఇప్పుడు ముందుగానే సముద్రంలోకి వస్తున్నారు. వాళ్ల వేట వల్ల క్రిల్ మరింత తగ్గిపోతోంది. దీంతో పెంగ్విన్లకు దొరికే ఆహారం ఇంకా తగ్గుతోంది.