Tejashwi Yadav: రాష్ట్రీయ జనతాదళ్ (RJD) కి ఇప్పుడు కొత్త చీఫ్ వచ్చారు. లాలూ వారసుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ను తాజాగా పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్.. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. ఈ ప్రకటనతో బీహార్ రాజకీయాల్లో ఆర్జేడీ పార్టీ ఒక కొత్త శకానికి నాంది పలికినట్లు అయ్యింది. “నూతన యుగం ప్రారంభం. రాష్ట్రీయ జనతాదళ్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తేజస్వి యాదవ్ నియమితులయ్యారు” అని పార్టీ తన అధికారిక X హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది.
READ ALSO: Vijay: ‘‘తలవంచేది లేదు, ఒంటరిగా గెలుస్తాం’’.. టీవీకే చీఫ్ విజయ్ కీలక వ్యాఖ్యలు..
బీహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్జేడీ జాతీయ కార్యవర్గ సమావేశంలో వాళ్లిద్దరూ ఈ ప్రకటన చేశారు. ఇతర అగ్ర నాయకుల సమక్షంలో లాలూ యాదవ్ తన కుమారుడు తేజస్వి యాదవ్‌కు నియామక లేఖను అందజేశారు. నిజానికి ఈ మాజీ ముఖ్యమంత్రి దంపతుల చిన్న కుమారుడు తేజస్వి యాదవ్. ఆయనకు అన్నయ్య తేజ్ ప్రతాప్ యాదవ్ ఉన్నప్పటికీ, తన తండ్రి తర్వాత పార్టీకి వారసుడిగా తేజస్వి యాదవ్ పేరు మాత్రమే తెరపైకి వచ్చేది. గత సంవత్సరం తేజ్ ప్రతాప్‌ను.. ఆయన తండ్రి లాలూ యాదవ్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో తాజాగా పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తేజస్వి ఎన్నికయ్యారు.
తేజస్వి యాదవ్ కెరీర్ గురించి చూస్తే..
తేజస్వి యాదవ్ నవంబర్ 9, 1989న గోపాల్‌గంజ్‌లో జన్మించారు. ఈ మాజీ ముఖ్యమంత్రి దంపతుల తొమ్మిది మంది సంతానంలో తేజస్వి చిన్నవారు. ఆయనకు ఏడుగురు సోదరీలు, ఒక సోదరుడు ఉన్నారు. మొదట్లో ఆయన పాట్నాలో పెరిగారు, ఆ తరువాత ఢిల్లీకి వెళ్లి ఆర్‌కె పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదివారు. అయితే 12వ తరగతి పూర్తి చేయడానికి ముందే ఆయన తన చదువు మానేశాడు. క్రికెట్ ఆల్ రౌండర్ అయిన తేజస్వి యాదవ్ తన పాఠశాల జట్టుకు నాయకత్వం కూడా వహించాడు. అలాగే అండర్-19 ప్రపంచ కప్‌లో భారతదేశానికి కూడా ప్రాతినిధ్యం వహించాడు. 2008 – 2012 మధ్య తేజస్వి ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టులో కూడా భాగంగా ఉన్నాడు, కానీ ఆ టైంలో IPL అరంగేట్రం చేయలేకపోయాడు. క్రికెట్ ఆడుతూనే 2010లో తేజస్వి రాజకీయాల్లోకి ప్రవేశించాడు. తన తండ్రి మార్గదర్శకత్వంలో, ఆయన RJD తరపున ప్రచారం చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత 2015లో తేజస్వి రఘోపూర్ నుంచి మహాఘట్బంధన్‌లో పొత్తులో భాగంగా తొలిసారి ఎన్నికల్లో విజయం సాధించారు. 26 ఏళ్ల వయసులో ఆయన రాష్ట్రంలో అతి పిన్న వయస్కుడైన ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. 2017లో నితీష్ కుమార్ కూటమిని విడిచిపెట్టిన తర్వాత ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా పని చేశారు. ప్రస్తుతం కూడా ఆయన బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా పని చేస్తున్నారు.
READ ALSO: Padma Shri Awards 2026: ఈ ఏడాది పద్మ అవార్డులు వరించిన ప్రముఖులు వీరే!