Nitin Gadkari: ఎయిర్ పొల్యూషన్ తగ్గించేందుకు కృషి చేస్తున్నామని, కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఇంధన వినియోగమే మేలు అని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ రోజు తిరుపతిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రత్యామ్నాయ ఇంధన వినియోగ ఆవశ్యకతను చెప్పారు. కాలుష్యంతో పాటు నీటి వనరులను కాపాడాల్సిన అవసరం ఉందని, గ్రీన్ ఇండియా కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనాలని సూచించారు. ఈ ఏడాది ఆగస్ట్ నాటికి 56 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఒక్కరోజే దేశంలో మూడు వందల చోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.
40 శాతం పొల్యూషన్ రహదారుల వల్లే వస్తోందని, కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఇంధన వినియోగానికి కృషి చేస్తున్నామని గడ్కరీ తెలిపారు. బెంగుళూరులో త్వరలో డీజిల్ లో ఇథనాల్ కలిపిన వాహనాలు నడవనున్నాయని, ఆగస్టులో ప్రముఖ ట్రాన్స్ పోర్ట్ కంపెనీలు ఇథనాల్ వినియోగ వాహనాలను విడుదల చేయనున్నాయని వెల్లడించారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని అన్నారు.
Read Also: Rajasthan: పోలీసుల కళ్లలో కారం కొట్టి.. గ్యాంగ్‌స్టర్ హత్య..
పెట్రోల్ వినియోగంతో పెరుగుతున్న వాయు కాలుష్యానికి చెక్ పెట్టేందుకే ఇతర మార్గాలపై అన్వేషణ ముమ్మరం చేసామని, ప్రత్యామ్నాయ ఇంధన వనరులయిన ఇథనాల్, మిథనాల్ వినియోగంపై దృషి గడ్కరీ చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అందుబాటులోకి వస్తే లీటర్ పెట్రోల్ ధర 15 రూపాయలకు పడిపోతుందని, బయో ఇథనాల్ వినియోగాన్ని ప్రోత్సహించనున్నామని, పెట్రోల్ కు ఇది చక్కని ప్రత్యామ్నాయం అని చెప్పారు.
బయో ఇథనాల్ తో నడిచే ద్విచక్ర వాహనాలను కొన్ని ప్రైవేట్ కంపెనీలు త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నాయని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణలో ఇథనాల్ సాయపడుతుందన్నారు. పెట్రోల్ లీటర్ 110 రూపాయలు ఉండగా, ఇథనాల్ 60 రూపాయలకే లభిస్తుందని తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్, బ్లాక్ హైడ్రోజన్ వనరుల వినియోగం మరింత పెరుగుతుందని, భవిష్యత్ గ్రీన్ హైడ్రోజన్ దే అని అన్నారు. కార్బన్ రహిత ఇంధనాలపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయని, భవిష్యత్తులో మనం ఇంధనం ఎగుమతి చేసే స్థాయికి వెళ్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.