నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరిగింది. నిర్ణీత సమయంలోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లను ఓటింగ్‌కు అధికారులు అనుమతిచ్చారు. ఉపఎన్నిక అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఈవీఎంలను ఆంధ్రా ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్‌కు అధికారులు తరలించారు. ఈనెల 26న ఆత్మకూరు ఉప ఎన్నిక ఫలితం వెల్లడి కానుంది. అయితే సాయంత్రం 5 గంటల వరకు 61.70% పోలింగ్ జరిగింది. 6 గంటల వరకు క్యూలో ఉన్నవారికి అవకాశం కల్పించడంతో 70 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో ఆత్మకూరు నియోజకవర్గంలో పోలింగ్ శాతంలో ఇప్పటివరకు ఇదే రికార్డు అని ఎన్నికల అధికారులు చెప్తున్నారు.
సాయంత్రం 5:30 గంటల వరకు ఆత్మకూరులో 2.88 శాతం, చేజర్లలో 62.5 శాతం, సంగంలో 65.52 శాతం, ఏఎస్ పేటలో 65.75 శాతం, అనంతసాగరంలో 64.68 శాతం, మర్రిపాడులో 63.68 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కాగా మంత్రిగా పనిచేసిన మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. వైసీపీ నుంచి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి బరిలో ఉండగా టీడీపీ పోటీ చేయలేదు. బీజేపీ నుంచి జి.భరత్ కుమార్, బీఎస్‌పీ నుంచి ఎన్.ఓబులేసుతో పాటు మరో ఐదుగురు గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు, ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు.