ఏపీ సీఎం జగన్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. తిరుపతి పర్యటనలో సీఎం జగన్ బిజీ బిజీగా ఉండగా ఓ అంగవైకల్యం ఉన్న వ్యక్తి ఆయన్ను కలిసేందుకు వచ్చాడు. 2019లో ఓ రోడ్డుప్రమాదంలో అంగవైకల్యం చెందిన మహేష్ అనే వ్యక్తి సీఎం జగన్‌కు తన గోడు వెల్లిబుచ్చడానికి వచ్చాడు. ఈ మేరకు ఓ అర్జీని సమర్పించాలని మహేష్ భావించాడు. కానీ సెక్యూరిటీ కారణంగా మహేష్ తన అర్జీని సీఎం జగన్‌కు ఇవ్వలేకపోయాడు. అయితే తిరుపతిలో పలు కంపెనీలకు ప్రారంభోత్సవాలు ముగించుకుని వెళ్లేదారిలో మహేష్‌ను సీఎం జగన్ గమనించారు. దీంతో తన కాన్వాయ్‌లోని సెక్యూరిటీ సిబ్బందికి మహేష్ చేతుల్లో ఉన్న అర్జీని తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అర్జీలోని అంశాలను పరిశీలించి మహేష్‌కు సాయం చేస్తామని జగన్ తెలిపారు.
మానవత్వం చాటుకున్న సీఎం జగన్
కాన్వాయ్ ఆపి వినతిపత్రాలు తీసుకున్న సీఎం #ApacheInAP #CMYSJagan #BuildAP #YSJaganDevelopsAP #InvestInAP pic.twitter.com/B0yDWj0Pf6
— YSRCP Digital Media (@YSRCPDMO) June 23, 2022
కాగా తిరుపతి పర్యటనలో సీఎం జగన్ పలు కంపెనీలకు ప్రారంభోత్సవాలు, భూమి పూజలు నిర్వహించారు. తిరుపతి ఈఎంసీలో మూడు గ్లోబల్ కంపెనీల యూనిట్లను సీఎం జగన్ గురువారం నాడు ప్రారంభించారు. టీసీఎల్, ఫాక్స్‌లింక్, డిక్సన్ టెక్నాలజీస్ యూనిట్లను ప్రారంభించారు. అటు మరో రెండు యూనిట్లకు సీఎం జగన్ భూమి పూజ చేశారు. శ్రీకాళహస్తి సమీపంలోని ఇంగలూరులో అడిడాస్ షూ తయారీ కంపెనీ అపాచీకి సీఎం జగన్ శంకుస్థాపన నిర్వహించారు. ఈ మేరకు ఏపీఈఐటీఏ ఎంఓయూలు కుదుర్చుకుంది. ఈ రోజు సీఎం జగన్ ప్రారంభించిన, భూమి పూజ చేసుకున్న పరిశ్రమల పెట్టుబడుల విలువ దాదాపు రూ.4వేల కోట్లుకాగా సుమారు 20వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.