Allagadda: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో దారుణం జరిగింది. శ్రీ కీర్తన స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల చిన్నారి గిలాగిలా కొట్టుకుంటూ ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి రాకను తల్లి చూస్తుండగానే ఆమె కళ్ల ముందే బస్సు చక్రాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయింది. శ్రీ కీర్తన హైస్కూల్ లో చిన్నారి హరి ప్రియ యూకేజీ చదువుతోంది. స్కూల్ ముగిసిన అనంతరం బస్సు దిగి ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. హరిప్రియ బస్సు దిగి రోడ్డు దాటేందుకు బస్సు ముందు నుంచి వెళ్తుండగా డ్రైవర్ గమనించకుండా బస్సును ముందుకు నడిపించడంతో బస్సు టైర్ల కింద పడి హరిప్రియ దేహం ఛిద్రమైంది.
Read Also: JNTU-H: JNTU హైదరాబాద్ బోర్డు ఆఫ్ స్టడీస్ సమావేశం.. R25 నిబంధనలపై కీలక నిర్ణయాలు..!
కన్న కూతురు కాసేపట్లో స్కూల్ నుంచి ఇంటికి వస్తుందని ఎదురు చూస్తుండగా చిన్నారిని మృత్యువు కబళించింది. స్కూల్ కి వెళ్లిన తొలిరోజే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. ముద్దు ముద్దుగా మాట్లాడే కూతురు మరణంతో తల్లిదండ్రులు శ్రీధర్, వనజ కన్నీరు మున్నీరవుతున్నారు. శ్రీధర్, వనజ దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉండగా.. ఇప్పుడు ప్రమాదంలో కూతురు ప్రాణాలు విడిచింది.. ప్రమాదం జరగగానే స్కూల్ బస్ డ్రైవర్ పరారయ్యారు. ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.