టాలీవుడ్ బాక్సాఫీస్‌కు 2025 అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ సారి రూ.500 కోట్లు, రూ.1000 కోట్ల క్లబ్‌లో ఒక్క తెలుగు సినిమా కూడా చేరకపోవడం ట్రేడ్ వర్గాలను నిరాశకు గురిచేసింది. ఇప్పుడు అందరి కళ్లు 2026, 2027 పైనే ఉన్నాయి. ఒకవైపు ప్రభాస్ ‘స్పిరిట్’, మహేష్ – రాజమౌళిల ‘వారణాసి’, రామ్ చరణ్ ‘పెద్ది’ వంటి సినిమాలు అప్పుడే ప్రమోషన్స్ మొదలుపెట్టి ఊపు తెస్తుంటే.. కానీ అల్లు అర్జున్, ఎన్టీఆర్ సినిమాల నుంచి మాత్రం ఉలుకూ పలుకూ లేదు.
అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న #AA22, అలాగే ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న #NTRNeel చిత్రాలపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్ మొదలై చాలా కాలం అవుతున్నా, ఇప్పటివరకు కనీసం ‘టైటిల్’ కూడా ప్రకటించకపోవడం ఫ్యాన్స్‌ను టెన్షన్‌లో పడేస్తోంది. ‘పుష్ప 2’తో అల్లు అర్జున్ సెన్సేషన్ క్రియేట్ చేయగా, ‘వార్ 2’ ఫలితంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈ కొత్త ప్రాజెక్టుల నుంచి వచ్చే ఒక చిన్న అప్‌డేట్ అయినా ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ప్రమోషన్స్ ఆలస్యమైతే హైప్ తగ్గే ప్రమాదం ఉందని, కనీసం టైటిల్స్ అనౌన్స్ చేసి సోషల్ మీడియాలో సౌండ్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఎప్పుడు సైలెన్స్ వీడతారో చూడాలి!