Tabletop runway: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఘోర విమాన ప్రమాదంలో మరణించారు. స్థానిక ఎన్నికల ప్రచారం కోసం ముంబై నుంచి బారామతికి ఆయన ప్రయాణించిన విమానం, ల్యాండింగ్‌కు కొన్ని క్షణాల ముందు కుప్పకూలింది. రన్ వే పక్కనే క్రాష్ కావడం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే, ఈ ప్రమాదంపై పౌర విమానయాన శాఖ దర్యాప్తు చేస్తోంది.
అయితే, ఈ ప్రమాదానికి బారామతిలో ఉన్న ‘‘టేబుల్ టాప్ రన్‌వే’’నే కారణమా.? అనే అనుమాలు వ్యక్తమవుతున్నాయి. ఈ టేబుల్ టాప్ రన్‌వేలు కలిగిన విమానాశ్రయాల్లోనే అత్యధిక ప్రమాదాలు జరిగాయి. ముఖ్యంగా ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లో ఈ ప్రమాదాలు చోటు చేసుకోవడం గమనార్హం.
సాధారణంగా చుట్టుపక్కల ప్రాంతాల కన్నా ఎక్కువ ఎత్తులో ఉండే రన్ వేలను ఈ పేరుతో వ్యవహరిస్తుంటారు. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, పర్వతాల ప్రాంతాల్లో ఉండే విమానాశ్రయాలు టేబుల్ టాప్ రన్ వేలను కలిగి ఉంటాయి. ఈ రన్ వేలు చిన్నగా ఉండటంతో పైలెట్లకు టేకాఫ్, ల్యాండిగ్ అనేది ఇబ్బందితో కూడుకున్న విషయం. ఒకవేళ ఎక్కువ రన్ వేని ఉపయోగించుకునే పక్షంలో విమానం క్రాష్ అవుతుంది. మంగళూర్, సిమ్లా, కాలికట్, లెంగ్‌పుయ్(మిజోరాం), పాక్యోంక్(సిక్కిం), బారామతిల్లో టేబుల్‌టాప్ రన్‌వేలు ఉన్నాయి.
ప్రమాదాలకు కేరాఫ్ టేబుల్- టాప్ రన్‌వే:
2010లో ఎయిరిండియా విమానం మంగళూర్ ఎయిర్ పోర్టులో క్రాష్ కావడంతో 158 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళూర్ ఘటన జరిగిన పదేళ్ల తర్వాత ఆగస్టు 07, 2020లో మరో టేబుల్ టాప్ రన్ వేపై విషాదం నెలకొంది. కోవిడ్ మహమ్మారి కారణంగా దుబాయ్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకువస్తున్న క్రమంలో కోజికోడ్‌లో ఎయిర్ ఇండియా విమానం టేబుల్ టాప్ రన్ వే నుంచి జారి కిందకు పడిపోయింది. ఈ ఘటనలో 19 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు మరణించారు. 169 మంది ప్రాణాలతో బయటపడ్డారు. 1977లో పోర్చుగల్‌లోని మదీరా విమానాశ్రయంలో టేబుల్ టాప్ రన్ వే కలిగిన ఎయిర్‌పోర్టులో కూలిపోయి 131 మంది మరణించారు.