Srisailam Temple: శ్రీశైలం మల్లన్న ఆలయానికి కన్నడ భక్తులు పోటెత్తారు భక్తుల రద్దీతో ఇప్పటికే ఉగాది ఉత్సవాలకు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు విస్తృత ఏర్పాట్లు చేశారు.. ఈనెల 27 నుండి 31వ తేదీ వరకు శ్రీశైలం క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఉగాది మహోత్సవాలు సమీపిస్తుండడంతో మల్లన్న ఆలయానికి కన్నడ భక్తజనం బారులు తీరారు. అయితే, ఉగాది మహోత్సవాలకు వారం ముందు నుంచే కన్నడ భక్తులు శ్రీశైలానికి తరలివచ్చారు. దానికి తోడు ఈనెల 26 వరకు మాత్రమే కన్నడ భక్తుల సౌకర్యార్థం దేవస్థానం మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనానికి అనుమతించారు. 27 నుండి ఉగాది మహోత్సవాల సందర్భంగా 31వ తేదీ వరకు భక్తులందరికీ శ్రీమల్లికార్జునస్వామి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతించడంతో ఈనెల 26 లోపే శ్రీమల్లికార్జునస్వామి స్పర్శ దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుందని కన్నడ భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు.
Read Also: CSK vs MI: నా మైండ్ బ్లాక్ అయింది.. ఎంఎస్ ధోనీ సూపర్: రుతురాజ్ గైక్వాడ్
దానికి తోడు ప్రత్యేక కావడిలో తమ ఇంటి ఆడపడుచుగా భావించే భ్రమరాంబాదేవి అమ్మవారికి పసుపు, కుంకుమతో పాటు మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి భక్తుల రద్దీతో తలపోటు వచ్చిందేమోనని మిరియాల చూర్ణాన్ని సాంప్రదాయంగా కావడిలో తీసుకొని లక్షలాదిగా తరలివస్తున్నారు. తెల్లవారుజామునే పవిత్ర పాతాళగంగలో పుణ్యాస్నానాలు ఆచరించి శ్రీమల్లికార్జునస్వామి దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరారు. క్యూలైన్లలో ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రత్యేక చర్యలు చేపట్టారు. క్యూలైన్స్ లో మంచినీరు, పాలు, బిస్కెట్లు, అల్పాహారం అందిస్తూ భక్తులకు సేవలందిస్తున్నారు. దీనితో శ్రీస్వామివారి స్పర్శ దర్శనానికి 3 గంటల సమయం అలానే శ్రీస్వామి అలంకార దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. అయితే ఈనెల 27 నుండి 31 వరకు ఉగాది ఉత్సవాల సందర్భంగా భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనానికి అనుమతిస్తారు. భక్తులు లక్షలలో పెరగడంతో శ్రీశైలంలో కన్నడ భక్తుల రద్దీతో సెల్ ఫోన్ సిగ్నల్స్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సెల్ ఫోన్స్ సిగ్నల్స్ లేకపోవడంతో భక్తులు ఇక్కట్లు పడుతున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఇబ్బందిపై సంబంధిత అధికారులు స్పందించి సిగ్నల్స్ వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని పలువురు కన్నడ భక్తులు కోరుతున్నారు.