చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మెరుపు స్టంపింగ్ చేసిన ఎంఎస్ ధోనీపై సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ప్రశంసలు కురిపించాడు. ముంబై బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను చేసిన స్టంపింగ్ చూసి తన మైండ్ బ్లాక్ అయిందని తెలిపాడు. ఈ ఏడాది ధోనీ మరింత ఫిట్‌గా ఉన్నాడని, ఇంకా యవ్వనంగా కనిపిస్తున్నాడన్నాడు. మూడో స్థానంలో ఆడటం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నాడు. ముంబైపై విజయం ఎంతో సంతోషంగా ఉందని రుతురాజ్ చెప్పుకొచ్చాడు. ముంబై నిర్ధేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
మ్యాచ్ అనంతరం సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ… ‘ముంబైపై గెలవడం ఆనందంగా ఉంది. విజయంలో నా పాత్ర ఉండడం సంతోషంగా ఉంది. ఏ జట్టుకైనా మూడో స్థానం చాలా కీలకం. మూడో స్థానం జట్టుకు మరింత సమతుల్యతను ఇస్తుంది. నా బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకోవడం సంతోషంగా ఉంది. మా స్పిన్నర్లు బాగా బౌలింగ్ చేశారు. చెపాక్‌లో ముగ్గురు స్పిన్నర్లు కలిసి బౌలింగ్ చేయడం ఉత్సాహాన్నిచ్చింది. ఖలీల్ అనుభవజ్ఞుడైన ప్లేయర్. నూర్ ఓ ఫ్యాక్టర్. అందుకే అతడు జట్టులో ఉండాలనుకున్నాము. ఇక యష్ జట్టులో ఉండటం ప్రయోజనమే’ చెప్పాడు.
‘ఎంఎస్ ధోనీ ఈ సంవత్సరం మరింత ఫిట్‌గా ఉన్నాడు. మహీ భాయ్ ఇంకా యవ్వనంగా కనిపిస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్ స్టంపింగ్ చూసి ఆశ్చర్యపోయా. 43 ఏళ్ల వయసులో కీపింగ్ చేయడం అంత సులువు కాదు. నిజంగా ధోనీ సూపర్’ అని రుతురాజ్ గైక్వాడ్ ప్రశంసలు కురిపించాడు. ముంబై ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో నూర్ అహ్మద్ వేసిన బంతిని అదనుకున్న ధోనీ.. అత్యంత వేగంతో వికెట్లకు గిరాటేశాడు. కేవలం 0.12 సెకన్లలోనే బెయిల్స్ పడగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.