కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు. ఏపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేసినా ఓడిస్తానని సవాల్ చేయడంపై నాదెండ్ల మనోహర్ స్పందించారు. ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి వ్యాఖ్యలు విని తనకు చాలా ఆశ్చర్యం కలిగిందన్నారు. ఆయనకు అంత అహంకారం ఎక్కడి నుంచి వచ్చిందో అర్ధం కావడం లేదని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ప్రగల్భాలు పలుకుతున్నారని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు.
ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఇకనైనా వ్యక్తిగత విమర్శలు మాని కాకినాడ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని నాదెండ్ల మనోహర్ హితవు పలికారు. రాజకీయాల్లో అధికారంలో ఉన్నాం కదా అని ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందనుకుంటే పొరబాటేనని తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలే ఓటుతో బుద్ధి చెప్తారని ఆయన పేర్కొన్నారు. కాకినాడలో ద్వారంపూడిపై జనసేన అభ్యర్థి ముత్తా శశిధర్ గెలవడం ఖాయమన్నారు. తమ నాయకత్వాన్ని చులకనగా మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.