Degree Exams Results: ఏపీలోని డిగ్రీ పరీక్షల ఫలితాలలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీలో వింత చోటుచేసుకుంది. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో విద్యార్థులకు 800 మార్కులకు పరీక్ష నిర్వహిస్తే కొందరు విద్యార్థులకు 2 వేలకు పైగా మార్కులు వచ్చాయి. ఓ విద్యార్థికైతే ఏకంగా 5,360 మార్కులు వచ్చాయి. ఈ మార్కులు చూసిన విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. తాము ఏ గ్రేడ్‌లో పాసయ్యామో తెలియక డిగ్రీ విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు.
Read Also: Prabhas: అన్‌స్టాపబుల్‌లో ప్రభాస్ ధరించిన షర్ట్ ధర ఎంతో తెలుసా?
విక్రమ సింహపురి యూనివర్సిటీలో 8 నెలల క్రితం డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. తాజాగా పరీక్షల ఫలితాలను వెల్లడించారు. 8 నెలల తర్వాత ఫలితాలు వెల్లడించినా మార్కులు తప్పుల తడకగా రావడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలామందికి 800 మార్కులకు 2 వేలకు పైగానే మార్కులు రావడంతో యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తాయి. అసలే ఫలితాలు లేటుగా వెల్లడించారని.. అయినా ఈ తప్పులేంటని అధికారులను విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ఘటనపై యూనివర్సిటీ రిజిస్ట్రార్ రామచంద్రారెడ్డి స్పందించారు. విద్యార్థుల మార్కుల జాబితాలో తప్పులు ఉంటే సవరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.