Ambati Rambabu: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. అసెంబ్లీకి రాకుండా పారిపోయిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడి కత్తి కమల్‌హాసన్ అంటూ సీఎం జగన్‌ను ఉద్దేశించి మాట్లాడుతున్న చంద్రబాబుకు.. భారతీయుడులో కమల్‌హాసన్ గురించి తెలియదా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. దుర్మార్గులకు, దుష్టులను, చంద్రబాబు లాంటి 420 గాళ్లను రాజకీయంగా గొంతు కోయడానికి వచ్చిన భారతీయుడిలో కమల్‌హాసన్ సీఎం జగన్ అని ప్రజలు చెబుతున్నారన్నారని స్పష్టం చేశారు. అలాంటి జగన్‌ను చంద్రబాబు చూడలేదా అంటూ చురకలు అంటించారు. 1986లో భద్రాచలంలో కరకట్ట కట్టానని చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. పోలవరం ముంపు గ్రామాలకు చంద్రబాబు వెళ్లగా.. అక్కడ అందరూ తమకు ప్రభుత్వ సాయం అందిందిని చెప్పారని.. ప్రజల మాటలు విని చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయ్యిందని అంబటి రాంబాబు ఆరోపించారు.
Read Also: Chandrababu Naidu: వరద బాధితులను మానవతావాదులు, దాతలు ఆదుకోవాలి
ఐదేళ్ళు అధికారంలో ఉన్న చంద్రబాబు పోలవరం ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. బస్సుల్లో జనాలను తీసుకుని వెళ్లి చంద్రన్న చంద్రన్న అంటూ ఆనాడు భజన చేయించారని మండిపడ్డారు. కాఫర్ డ్యాం కట్టకుండా డ్రయాఫ్రమ్ వాల్ ఎందుకు కట్టాడో చంద్రబాబు చెప్పాలన్నారు. సెంట్రింగ్ వేయకుండా శ్లాబ్ వేయించాడని.. కేంద్రం కట్టాల్సిన జాతీయ ప్రాజెక్టును చంద్రబాబు ఎందుకు తీసుకున్నాడని ప్రశ్నించారు. డబ్బులకు కక్కుర్తిపడి కాదా అని నిలదీశారు. 2018లో పూర్తి చేస్తానని చెప్పి ఎందుకు పూర్తి చేయలేదన్నారు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా కుదురుతుందన్నారు. పోలవరం ముంపునకు గురి కావటానికి చంద్రబాబే కారణమని అంబటి రాంబాబు ఆరోపించారు. త్వరలోనే పోలవరంలో జరిగిన అవినీతి వ్యవహారాలు బయటకు తీస్తామని.. చంద్రబాబు, దేవినేని ఉమా కలిసి చేసిన అరాచకం అంతా ఇంతా కాదన్నారు. ఆ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి గోదావరి వరద ప్రాంతాల్లో జగన్ మీద చంద్రబాబు ఏడుపు యాత్ర ప్రారంభించాడని.. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను రెచ్చగొట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంది అయినా సరే ఏదో లబ్ధి పొందాలని చంద్రబాబు తాపత్రయం చూస్తుంటే బాధ వేస్తుందని అంబటి రాంబాబు పేర్కొన్నారు.