ఏపీలో జగనన్న గోరుముద్ద పథకంలో అవినీతి జరిగిందన్న టీడీపీ నేతల ఆరోపణలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఖండించారు. ద్యార్థులకు ఇచ్చే చిక్కి కోసం రూ.350 కోట్లు వెచ్చిస్తున్నామని, గ్లోబల్ టెండర్ ప్రకారమే వీటి సరఫరా జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. నాణ్యతను కూడా టాటా కన్సల్టెన్సీ లాంటి ఏజెన్సీ ద్వారా తనిఖీ చేయించి టెండర్లు ఇచ్చామని మంత్రి సురేష్ తెలిపారు. తమ ప్రభుత్వం ఎవరికీ అక్రమంగా టెండర్లు కట్టబెట్టలేదనే విషయాలను ప్రతిపక్షాలు గుర్తించాలని హితవు పలికారు.
Read Also: ఏపీలో ఆర్టీసీ సమ్మె సైరన్.. ఆగిపోనున్న బస్సులు
గతంతో పోలిస్తే ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య పెరగడంతో ఎక్కువ మొత్తంలో చిక్కీలు కొన్నామని… దానిని కూడా అవినీతి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి సురేష్ మండిపడ్డారు. టీడీపీ హయాంలో నీళ్ల సాంబారు, చిన్న సైజు గుడ్లు సరఫరా చేశారని.. తమ ప్రభుత్వ హయాంలో కోవిడ్ జాగ్రత్తలో భాగంగా ప్రతి విద్యార్థికి 25 గ్రాముల చిక్కీ ప్యాకెట్‌ను వ్యక్తిగతంగా ఇస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. మరోవైపు పీఆర్సీ విషయంలో ఉద్యోగులు ముందుకే వెళ్ళాలని.. గడియారం వెనక్కు తిరగడం కుదరదని వారు గుర్తించాలన్నారు. ఉపాధ్యాయులు దారుణంగా మాట్లాడుతున్నారని, ఇలా మాట్లాడటంపై ఉపాధ్యాయులు విచక్షణతో ఆలోచించాలని హితవు పలికారు.