అమరావతి: తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినీ రంగ సమస్యలపై జగన్‌తో చాలా విషయాలు చర్చించానని.. కానీ అవి ఇప్పుడు చెప్పనని.. సరైన వేదికపై మాట్లాడతానని తెలిపారు. విశాఖకు సినీ ఇండస్ట్రీని తరలించే విషయంపై అందరం సమావేశమై చర్చిస్తామని మంచు విష్ణు పేర్కొన్నారు. జగన్ తనకు వరుసకు బావ అయినా అన్న అని పిలుస్తానని ఆయన చెప్పారు.
అటు తిరుపతిలో త్వరలో ఫిల్మ్ స్టూడియో పెడుతున్నట్లు మంచు విష్ణు ప్రకటించారు. సీఎం జగన్ అన్నతో చర్చలకు నాన్న గారిని పిలవలేదనేది దుష్ప్రచారమని పేర్కొన్నారు. ప్రభుత్వం నాన్న గారికి కూడా ఆహ్వానం పంపిందని.. కానీ ఆ ఆహ్వానాన్ని అడ్డుకున్న వారెవరో తనకు తెలుసన్నారు. సినీ పరిశ్రమకు ఏపీ, తెలంగాణలు రెండు కళ్లు అని చెప్పారు. సినీ పరిశ్రమ మొత్తం ఒకే కుటుంబమని మంచు విష్ణు స్పష్టం చేశారు. తనకు సినిమా పరిశ్రమ మద్దతు లేదని ప్రచారం చేయడంలో అర్థం లేదని.. నిజంగానే తనకు మద్దతు లేకపోతే బంపర్ మెజారిటీతో మా అధ్యక్షుడిగా ఎలా గెలుస్తానని మంచు విష్ణు ప్రశ్నించారు.