ఆస్తుల కోసం తోబుట్టువులను దూరం చేసుకుంటున్న ఈ రోజుల్లో ఓ అన్న తన చెల్లెలి కోసం చేస్తున్న పోరాటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన దుర్గారావు తన చెల్లి కోసం హస్తిన బాట పట్టాడు. తన సోదరి నవ్యతను చందాపురం గ్రామానికి చెందిన కొంగర నరేంద్రనాథ్ కిచ్చి 2018లో పెళ్లి చేశాడు. కట్నంగా 23 లక్షల డబ్బు బంగారం, మూడు ఎకరాల పొలం ఇచ్చాడు. కానీ అత్తింటివారి ధనదాహం తీరలేదు. తరచూ డబ్బు ఇవ్వాలంటూ చెల్లెలికి వేధింపులు తప్పలేదు. దీంతో దుర్గారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాళ్లు కూడా అంతగా పట్టించుకోలేదు. దీంతో ఢిల్లీ వెళ్లి సుప్రీంకోర్టు తలుపు తట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఈనెల 23న ముప్పాళ్ల నుంచి తల్లితో కలిసి ఎడ్లబండి మీద హస్తినకు బయల్దేరాడు.
తన చెల్లెలి అత్తమామల ఫ్లెక్సీలను ఎడ్లబండికి ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేస్తుంటే రూ.50 లక్షలకు పరువు నష్టం దావా వేసి నోటీసులు ఇస్తామని బెదిరింపులు కూడా వచ్చాయి. ఈ విషయాలపై మీడియాలో కథనాలు రావడంతో హెచ్‌ఆర్సీ స్పందించింది. కేసు సుమోటోగా స్వీకరించి అధికారులకు నోటీసులు జారీ చేసింది. HRC జ్యుడిషియల్ సభ్యుడు దండే సుబ్రమణ్యం… అధికారులతో పాటు నవ్యత ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అలాగే కేసును సుమోటోగా స్వీకరించిన హెచ్చార్సీ విచారణ స్వీకరించి జూన్ 13కు వాయిదా వేసింది. హెచ్‌ఆర్సీ నోటీసులతో అలర్ట్ అయిన అధికారులు దుర్గారావుకు సమాచారం అందించి అతడి ప్రయాణం ఆపించారు. ఎలాగైనా న్యాయం జరిగేలా చూస్తామని దుర్గారావుకు అధికారులు హామీ ఇచ్చారు.