సాధారణంగా ఎక్కడ చూసినా ఆలయాల్లో ప్రసాదం పేరిట పులిహోర లేదా కేసరి లేదా దద్దోజనం లేదా లడ్డూలు అందిస్తుంటారు. కానీ ఏపీలోని అన్నవరం దేవస్ధానంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఇక్కడి ఆలయంలో ప్రసాదం కింద భక్తులకు గోధుమ నూకతో చేసిన ప్రసాదం అందిస్తారు. ఈ ప్రసాదం రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి ప్రసాదం మరెక్కడా దొరకదు. తిరుపతి లడ్డూ ఎంత ప్రసిద్ధి చెందిందో.. అన్నవరం ప్రసాదం కూడా అంతే ఆదరణ పొందింది.
అన్నవరం ఆలయంలో గోధుమ నూకతోనే ఎందుకు ప్రసాదం తయారు చేస్తారు.. ఈ సంప్రదాయాన్ని ఎవరు ప్రారంభించారు అన్న విషయాలపై అధికారులకు సైతం పూర్తి స్పష్టత లేదు. అందరికీ నచ్చుతోంది కాబట్టి ఈ ప్రసాదాన్ని కొనసాగిస్తున్నట్టు అన్నవరం దేవస్థానం అధికారులు వివరిస్తున్నారు. అయితే అన్నవరం సత్యనారాయణస్వామికి గోధుమలతో తయారుచేసిన పదార్ధాలతో చేసిన నైవేథ్యం సమర్పించడం ఆచారం. అందువల్ల గోధుమ నూకతో తయారుచేసిన ఆహారాన్ని భక్తులకు అందిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. గోధుమ నూకకి పంచదార, నెయ్యి జోడించడంతో వచ్చిన రుచి అందరికీ నచ్చడంతో దానినే ప్రసాదంగా ఇస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు.
Interesting Facts: తాజ్‌మహల్‌పై విద్యుత్ దీపాలు ఎందుకు ఉండవు?
అన్నవరం ప్రసాదం తయారీకి ప్రధానంగా గోధుమ నూక, పంచదార, నెయ్యి, యాలకుల పొడి వాడుతారు. మొదట నీళ్లు బాగా మరిగించి, అందులో గోధుమ నూక వేస్తారు. ఆ తర్వాత పంచదార వేసి రంగు మారే వరకూ ఉడికిస్తారు. చివరిలో నెయ్యి వేసి కలుపుతారు. అన్నవరం ప్రసాదం తయారీకి వాడేది కేవలం నాలుగు పదార్థాలే అయినా రుచి మాత్రం చాలామందిని ఆకట్టుకుంటుంది. ఈ ప్రసాదం ప్రత్యేకంగా ప్యాకింగ్ చేయించి దూర ప్రాంతాలకు సైతం తీసుకెళ్తూ ఉంటారు. అన్నవరం ప్రసాదంలో మరో ప్రత్యేకత ఏంటంటే.. ప్యాకింగ్ కోసం కేవలం విస్తరాకులు మాత్రమే వాడతారు. అందువల్ల అన్ని వేళలా ఈ ప్రసాదం రుచిని కలిగి ఉంటుంది. మిగతా ఆలయాల తరహాలో ప్లాస్టిక్ కవర్లలో ప్రసాదం ప్యాకింగ్ అన్న మాటే అన్నవరం ఆలయంలో వినిపించదు.