బాపట్ల జిల్లా అద్దంకిలో పొలిటికల్ సీన్ మారుతుంది. నియోజకవర్గంలో మొన్నటి వరకు ఒక లెక్క.. ఇప్పుడో లెక్క అన్నట్లు పరిస్థితులు మారిపోయాయి. పాత కొత్త ఇంఛార్జ్ లను సమన్వయం చేయకపోవడంతో అద్దంకి వైసీపీ వ్యవహారాలు ఎవరికి వారే.. యమునా తీరే అన్నట్లుగా మారిపోతున్నాయి. కొత్త ఇంఛార్జ్ వైసీపీ నేతలను కలిసేందుకు ఊరురా తిరుగుతూ ఉంటే.. పాత ఇంఛార్జ్ ఆ ఊరి నేతలతో కలిసి మీటింగ్ పెట్టి సమాలోచనలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇంఛార్జ్ మార్పు వైసీపీకి కలిసొస్తుందా..? కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక పోయింది అన్న చందంగా మారుతుందా..? అన్నది చర్చనీయాంశంగా మారింది.
అద్దంకి నియోజకవర్గం ఇంఛార్జ్ గా పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరుకు చెందిన పాణెం హనిమిరెడ్డిని హైకమాండ్ నియమించింది. వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి అండదండలతో ఇంఛార్జ్ గా అవకాశం దక్కించుకున్నారు. అద్దంకి నియోజకవర్గం ఇంఛార్జ్ గా హనిమిరెడ్డి బాధ్యతలు స్వీకరించిన వెంటనే.. అన్ని మండలాల్లో పర్యటిస్తున్నారు. మండలాల నేతలను కలుస్తూ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక వైవీ సుబ్బారెడ్డి సోదరుడు వైవీ భద్రారెడ్డి హనిమిరెడ్డి వెన్నంటే చేదోడు వాదోడుగా ఉంటున్నారు. గతంలో ఇంఛార్జ్ గా ఉన్న కృష్ణచైతన్యకు ద్వితీయ శ్రేణి నేతలతో కొంత గ్యాప్ ఏర్పడటం.. కొందరు అసమ్మతి నేతలు అద్దంకి వైసీపీ పరిరక్షణ పేరిట ఇంఛార్జ్ కృష్ణచైతన్యకు వ్యతిరేకంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం.. చైతన్యకు వ్యతిరేకంగా తాడిపల్లి సెంట్రల్ ఆఫీస్ దగ్గర ఆందోళనలు చేశారు.
Chandrababu: వైసీపీ ఎమ్మెల్యేలపై పేరు పేరునా చంద్రబాబు ఘాటు విమర్శలు.. ఆ ఎమ్మెల్యేపై తప్ప..!
నియోజకవర్గంలో తన పట్టును పెంచుకోవడంతో పాటు పార్టీ బలాన్ని పెంచడంతో కృష్ణచైతన్య సక్సెస్ అయ్యారు. పార్టీ సర్వే ఫలితాలు కూడా కృష్ణచైతన్యకు జైకొట్టాయి. అయితే సామాజిక సమీకరణాలతో అనూహ్య పరిణామాలు జరిగాయి. దీంతో అదృష్టం హనిమిరెడ్డికి దక్కింది. సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే కమ్మ సామాజిక వర్గానికి చెందిన గొట్టిపాటి రవికుమార్ కు చెక్ పెట్టాలంటే.. రెడ్డి సామాజిక వర్గాన్ని తీసుకొచ్చారు. ఇతర సామాజిక వర్గాలను ఏకం చేసి కమ్మకు చెక్ పెట్టాలనే స్ట్రాటజీతో ఈ మార్పు జరిగిందని టాక్. అయితే ఈ పరిణామాలు మాజీ ఇంఛార్జ్ కృష్ణచైతన్యకు ఇబ్బందికరంగా మారాయి. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి నాలుగున్నరేళ్లుగా ఎంతో కష్టపడి చేశానని అన్నారు. తనను హఠాత్తుగా తొలగించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు అవకాశమిస్తే కచ్చితంగా గెలిచి చూపిస్తానని హైకమాండ్ ను కోరారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ మారేదిలేదని, చివరి నిమిషం వరకు టికెట్ ప్రయత్నాలు చేస్తానని చెప్పారు.