ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి గల్లా అరుణకుమారి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె గతంలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2014 తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారు. అయితే ఆమె తనయుడు గల్లా జయదేవ్ మాత్రం టీడీపీ ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ భవిష్యత్ గురించి గల్లా అరుణకుమారిని మీడియా ప్రశ్నించింది. ఈ సందర్భంగా తన రాజకీయ జీవితం ముగిసిందని ఆమె ప్రకటించారు. తాను చేపట్టని పదవి.. చూడనటువంటి రాజకీయాలు ఏమీ లేవన్నారు. తన సంకల్పమే తన భవిష్యత్ అన్నారు.
రాజకీయాలకు తాను దూరంగా ఉన్నా తనకు ఇంకా అనుచర వర్గం ఉందని గల్లా అరుణకుమారి వెల్లడించారు. అయితే వాళ్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చానని.. వాళ్లకు ఎక్కడ బాగుంటే అక్కడ ఉండాలని చెప్పానని తెలిపారు. టీడీపీకి చంద్రబాబే పెద్ద దిక్కు అని.. తనలాంటి వాళ్లు ఎంత అని ఆమె ప్రశ్నించారు. గల్లా జయదేవ్ టీడీపీలో ఉన్నాడు కాబట్టి.. తాము ఆయనకే సపోర్ట్ చేస్తామని గల్లా అరుణకుమారి తెలిపారు. కాగా గతంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యత్వానికి గల్లా అరుణకుమారి రాజీనామా చేయడం హాట్ టాపిక్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఆమె తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు వివరణ ఇవ్వడంతో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడినట్లయ్యింది.