ఏపీలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి వద్ద 30వ నంబర్ జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఓ మలుపు వద్ద డ్రైవర్ నిర్లక్ష్యంగా ఉండటంతో బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నాడు. బస్సులో ప్రయాణిస్తున్న 40 మందికి గాయాలయ్యాయి.
కాగా క్షతగాత్రులను స్థానికులు వెంటనే చింతూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. సంగీత ట్రావెల్స్‌కు చెందిన బస్సు భవానీ పట్నం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై వివరాలు సేకరిస్తున్నారు.
