Cockfighting: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి.. ఓ వైపు కోడి పుంజులు కాలికి కత్తిగట్టి గాలిలోకి ఎగురుతున్నాయి… మరోవైపు పోట్లగిత్తలు రంకెలేస్తూ రయ్యి.. రయ్యిమంటూ కుమ్ముతున్నాయి. నిజానికి సంక్రాంతి పండగ అంటే… గతంలో పిండి వంటలు, భోగి మంటలు, ముత్యాల ముగ్గులపై ఫోకస్ పెట్టే వారు. కానీ కాలక్రమేనా సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ మారుతూ వస్తున్నాయి. ఇప్పుడు సంక్రాంతి సంబరాల ట్రెండ్ మారింది. కోడిపందేలు ఉంటేనే ఇప్పుడు పండగ అనేలా తయారైంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంతటా అన్ని జిల్లాల్లో కోడి పందేల జోష్ మామూలుగా లేదు. పోలీసుల ఆంక్షలు తోసిరాజని మరీ పందేలకు… గిరి గీసి… బరులు ఏర్పాటు చేశారు. అంతే కాదు ఒక్కో బరిలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి.. పండక్కి మూడు రోజులపాటు డై అండ్ నైట్ అనే తేడా లేకుండా పందేలు నిర్వహిస్తున్నారు. ఇక పందెం బరుల దగ్గర జోష్ చెప్పాల్సిన అవసరం లేదు. టెంట్లు, షామియానాలతోపాటు వీఐపీ సీటింగ్, ఎల్ఈడీ తెరలు, వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ వంటివి ఏర్పాటు చేశారు. ఇక కోట్ల రూపాయల్లో నిర్వహిస్తున్న పందేల కోసం కౌంటింగ్ మిషన్లు కూడా తెప్పించారంటే కాక్ ఫైటింగ్ ఏ రేంజ్‌లో జరుగుతుందో ఊహించుకోవచ్చు..
Read Also: Oscar Nominations: కార్చిచ్చు ఎఫెక్ట్.. ఆస్కార్ నామినేషన్లు మరోసారి వాయిదా
అంగరంగ.. నా సామిరంగ అంటూ సాగుతున్న కోడిపందేలను చూడటానికి ఎక్కడెక్కడి నుంచో జనం భారీగా తరలివస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, కర్ణాటక, చెన్నై తదితర ప్రాంతాల నుంచి కూడా ఈ పందేలను చూడటానికి వస్తున్నారు. సామాన్యులతో పాటు రాజకీయ, సినీ, వ్యాపారవేత్తలు, ఎన్ఆర్ఐలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు. దీంతో పండగ వేళ పల్లెలు.. కిక్కిరిసిన జనంతో కొత్త కళను సంతరించుకుంటున్నాయి… ఇక కోడి పందేల్లో కాకి, నెమలి, డేగ, పచ్చకాకి, కేతువ వంటి జాతి కోళ్లు కత్తికట్టి కాలు దువ్వుతున్నాయి. వీటి హవానే ఇన్నేళ్ల నుంచీ పందేల్లో కొనసాగుతుంది. ఈ సారి కూడా ఈ జాతి కోళ్లదే హవా నడుస్తోందని చెబుతున్నారు పందేం రాయుళ్లు. ఇక ఒక్కో పందెం వేల నుంచి లక్షల రూపాయల్లోకి వెళ్లిపోయింది. గరిష్టంగా ఒక్కో పందెం రూ. 25 లక్షల వరకు కాస్తున్నాంటే కోడి పందేలా మజాకా అనుకోక తప్పదు. ఈ రేంజ్‌లో పందేలు కాసిన తర్వాత గంటల్లోనే లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఇక ఈ మూడు రోజులు ఒక్కో బరిలో పదుల కోట్ల రూపాయల వరకు పందెం పేరుతో డబ్బు చేతులు మారుతుందనే అంచనాలు ఉన్నాయి. పందెంలో డబ్బులు లెక్కపెట్టేందుకు అక్కడక్కడా ఏకంగా కౌంటింగ్ మిషన్లు సైతం ఏర్పాటు చేశారు. కోడిపుంజు పందెం బరిలో దిగింది.. కాకి డేగ, కాకి నెమలి, సీతువా లాంటి రకాలు ఎక్కువగా పందేలు గెలుస్తున్నాయి.. పందెం బరిలో గెలుపు గ్యారెంటీ అంటూ తొడగొడుతున్నాయి కోళ్ళు.. రంగు ప్రధానంగా గెలుపును ఇస్తుందంటున్నారు పందెంగాళ్ళు..