Oscar Nominations: లాస్ ఏంజెలెస్‌లో దావానంలా వ్యాపిస్తున్న కార్చిచ్చు హాలీవుడ్‌ను ప్రభావితం చేయడంతో ఆస్కార్ నామినేషన్ల ప్రక్రియ వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం జనవరి 23న నామినేషన్లు ప్రకటించనున్నట్లు అకాడమీ ప్రకటించింది. ‘‘లాస్ ఏంజెలెస్‌లో కొనసాగుతున్న మంటల కారణంగా ఓటింగ్ వ్యవధిని పొడిగించి, సభ్యులకు మరింత సమయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము’’ అని అకాడమీ సీఈవో బిల్ క్రేమర్, అధ్యక్షురాలు జానెట్ యాంగ్ తెలిపారు. ఇకపోతే, ఈ ప్రక్రియ జనవరి 8 నుంచి 14 వరకు జరగాల్సి ఉండగా.. కార్చిచ్చు కారణంగా జనవరి 17కు వాయిదా వేశారు. అయినప్పటికీ, మంటలు ఇంకా తగ్గకపోవడంతో నామినేషన్లను జనవరి 23న ప్రకటించనున్నట్లు వెల్లడించారు.
Also Read: Sankranthiki Vasthunam: బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కొల్లగొడుతున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’
లాస్ ఏంజెలెస్ చుట్టుపక్కల ప్రదేశాల్లో తీవ్రమైన కార్చిచ్చు కారణంగా హాలీవుడ్ పరిశ్రమతోపాటు అనేక కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దీనితో ఆస్కార్ నామినేషన్ల ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేయాలని అకాడమీ నిర్ణయించింది. ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్ల బరిలో భారత్ నుంచి ఆరు చిత్రాలు నిలిచాయి. కంగువ (తమిళం), గర్ల్స్ విల్ బి గర్ల్స్ (హిందీ, ఇంగ్లిష్), ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ (మలయాళం), ది గోట్ లైఫ్ (హిందీ), సంతోష్ (హిందీ), స్వాతంత్య్ర వీర్ సావర్కర్ (హిందీ) సినిమాలు ఆస్కార్ నామినేషన్ల బరిలో ఉన్నాయి. ఈ చిత్రాలు ఆస్కార్ నామినేషన్లలో చోటు సంపాదించగలిగితే, భారతీయ చిత్ర పరిశ్రమకు ఇది గొప్ప గౌరవంగా నిలుస్తుంది.