Pastor Praveen Death Case: హైదరాబాద్ నుంచి వెళ్లిన ఓ పాస్టర్ రాజమండ్రి శివార్లలో మృతిచెందిన ఘటన కలకలం సృష్టించింది.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్ అనుమానస్పద మృతిపై సమగ్ర దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతుంది. రాజమండ్రి శివారు కొంతమూరు వద్ద బుల్లెట్ పై వెళ్తూ ప్రాణాలు కోల్పోయిన పాస్టర్ ప్రవీణ్ కేసులో పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్ మృతి పట్ల పలువురు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ప్రవీణ్ మరణం ప్రమాదమా? హత్యా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టి.. ఆధారాల సేకరణలో నాలుగు పోలీసు బృందాలు నిమగ్నమయ్యాయి. మరో రెండు రోజుల్లో పోస్టుమార్టం నివేదిక వస్తే పాస్టర్ మృతిపై స్పష్టత రానుంది. అన్ని కోణాల్లోనూ ఈ కేసు సమగ్ర దర్యాప్తు జరుగుతుందంటున్నారు పోలీసులు..
Read Also: Robinhood Review: రాబిన్ హుడ్ రివ్యూ
పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసు.. ప్రమాదమా? పన్నాగమా? అనే మిస్టరీ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ప్రమాదానికి 12 సెకండ్ల ముందు ఏం జరిగింది?, ఆ సమయంలో సీసీ కెమెరాల్లో రికార్డయిన విజువల్స్ ఆధారంగా జరిగిన పరిణామాలపై పోలీసుల దృష్టి పెట్టారు.. ఇంతకుముందు బైక్ వెనుక ఐదు వాహనాలు వెళ్లినట్లు సీసీ ఫుటేజ్ రికార్డింగ్ తేల్చగా.. ఈ వాహనాల గురించి వివరాలను సేకరించే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, పాస్టర్ ప్రవీణ్ మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఇప్పటికే ప్రకటించారు. ప్రవీణ్ చనిపోవడానికి ముందు సీసీ కెమెరా దృశ్యాలు దర్యాప్తులో కీలకంగా మారాయన్నారు. కాగా, పాస్టర్ ప్రవీణ్ కుమార్.. సికింద్రాబాద్‌లో నివాసం ఉండేవారు.. తూర్పు గోదావరి జిల్లా చాగల్లులో జరిగే క్రైస్తవ సభలకు హాజరయ్యేందుకు సోమవారం సాయంత్రం ఆయన తన బైక్‌పై బయల్దేరారు. మంగళవారం ఉదయం రాజమండ్రి సమీపంలోని కొంతమూరు వద్ద రోడ్డు పక్కన విగతజీవిగా పడి ఉన్నారు. అయితే, బైక్ బ్యాలెన్స్ తప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లడం.. ఆయన ముందుగా పడిపోయిన తర్వాత.. ఆయన పైన బైక్ పడడంతో మృతిచెంది ఉంటారని ప్రాథమికంగా అంచనా వేశారు.. కానీ, ప్రవీణ్ పగడాల మృతిపై క్రిస్టియన్ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేయడం.. ఆందోళనకు దిగడంతో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు..