అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి దగ్గర మంగళవారం మధ్యాహ్నం ఉద్రిక్తత నెలకొంది. డంపింగ్ యార్డు వివాదం ఈ ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో టీడీపీ నేతలు, వైసీపీ నేతల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం చోటుచేసుకుంది. డంపింగ్ యార్డుపై టీడీపీ నేతలు సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టుకు స్పందించిన వైసీపీ కార్యకర్తలు బాలయ్య ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే వారిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరినొకరు తోసుకున్నారు.
Read Also: ఏపీలో పీఆర్సీ రగడకు పడని ఎండ్‌కార్డ్
సమాచారం అందుకున్న పోలీసులు బాలయ్య ఇంటి వద్దకు చేరుకుని టీడీపీ, వైసీపీ వర్గాల వారిని శాంతింపచేశారు. కాగా డంపింగ్ యార్డు ఫోటోలను పెట్టి జగన్ సర్కారు చెప్పుకుంటున్న అభివృద్ధి ఎంత నాసిరకంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఓ టీడీపీ నేత సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ వివాదం తలెత్తింది. తమ ప్రభుత్వ అభివృద్ధిపై టీడీపీ సవాల్‌ను స్వీకరించి చర్చకు వచ్చామని వైసీపీ నేతలు చెప్తున్నారు. అయితే అభివృద్ధిపై ప్రశ్నిస్తే ఇంటిని ముట్టడిస్తారా అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు.