ఓమిక్రాన్ వేరింయట్ వేగంగా వ్యాప్తి నేపథ్యంలో, కోవిడ్ 19 వ్యాప్తిని నివారించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. దీనికి సంబంధించి కేంద్రం జారీ చేసిన పరిమితులు/మార్గదర్శకాల జాబితా చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తులందరూ మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. నిబంధనలు పాటించకుంటే రూ. 100 జరిమానా విధిస్తారు. మాస్క్ ముక్కు, నోటిని కప్పి ఉంచాలి. సంస్థలు లేదా దుకాణాలు మాస్క్ లేని వ్యక్తిని తమ ప్రాంగణంలోకి అనుమతిస్తే పరిస్థితి తీవ్రతను బట్టి వారికి రూ.10,000 నుండి రూ.25,000 వరకు జరిమానా విధించనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.
ఏదైనా మార్కెట్ లేదా వాణిజ్య సంస్థలో కోవిడ్ ప్రోటోకాల్‌ను అనుసరించడంలో ఏదైనా ఉల్లంఘనలకు పాల్పడితే ఆప్రాంతం వెంటనే ఒకటి రెండు రోజుల్లో మూసివేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆప్రాంతంలో కోవిడ్-సముచిత నియమావళి మరియు జరిమానాలపై అవగాహన కల్పించడానికి మార్కెట్ అసోసియేషన్లను ప్రభుత్వం భాగస్వామ్యం చేసింది. దీనికి సంబంధించి వాట్సాప్ నంబర్ 8010968295లో ఫోటోగ్రాఫ్‌లను పోస్ట్ చేయడం ద్వారా కోవిడ్-రూల్స్‌ను అతిక్రమించిన వారిని అధికారుల దృష్టికి తీసుకెళ్ల వచ్చు. కోవిడ్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించే దుకాణాలపై చర్య తీసుకోవడానికి ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక అధికార యంత్రాంగాన్ని నియమించింది.
వివాహాలు, సమావేశాలకు 500 మంది మాత్రమే
వివాహాలు, మతపరమైన సమావేశాలు సామాజిక కార్యకలాపాలతో సహా అన్ని సమావేశాలను నిర్వహించుకోవడానికి గరిష్టంగా 500 మందికి మాత్రమే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశాల్లో పాల్గొనే వారందరూ మాస్క్ ధరించడం, తరచుగా హ్యాండ్ శానిటైజేషన్ చేయడం మరియు సామాజిక దూరాన్ని పాటించడంతోపాటు కోవిడ్ రూల్స్‌ను విధిగా నిబంధనలు పాటించాల్సిందే.
నిబంధనలను ఉల్లంఘిస్తే విపత్తు నిర్వహణ చట్టం, 2005 ప్రకారం సెక్షన్లు 51 నుండి 60 వరకు, IPCలోని సెక్షన్ 188 అలాగే వర్తించే ఇతర చట్టాల ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీనికి సంబంధించిన అధికారాన్ని కలెక్టర్లు, జిల్లా మేజిస్ట్రేట్లు, పోలీసు కమిషనర్లు మరియు ఎస్పీలు అమలు చేస్తారని ప్రభుత్వం పేర్కొంది. లాక్‌డౌన్ లాంటి విపత్కర పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే ఇలాంటి నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందేనని ప్రభుత్వం భావిస్తోంది.