Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఇవాళ (బుధవారం) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పవన్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఏపీకి రావాల్సిన నిధులు, విభజన అంశాలు, కేంద్ర ప్రభుత్వ సహకారంపై ప్రధానితో ఆయన చర్చించనున్నారు. అలాగే, జలజీవన్ మిషన్ స్కీమ్‌లో భాగంగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులను సైతం ఇవ్వమని కోరనున్నారు. ఈ పథకాన్ని కొనసాగించాలని కోరే అవకాశం ఉంది. ఇప్పుడు ఏపీలో తాగు నీటి సరఫరా శాఖ మంత్రిగా ఉన్న పవన్.. ఇంటింటికీ కుళాయిని ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. జల జీవన్ మిషన్ ద్వారా ఈ కుళాయిల ఏర్పాటు చేయనున్నారు. అందుకే ఈ పథకాన్ని కొనసాగించాలని ప్రధాని మోడీని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కోరనున్నారు.
Read Also: Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్
ఇక, నిన్న పవన్ కళ్యాణ్.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. ఏపీ పర్యాటక అభివృద్ధిపై ఇరువురు ప్రధానంగా చర్చించారు. టూరిజం ప్రాజెక్టులు, పర్యాటక యూనివర్శిటీ లాంటి ఏడు అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ కి ఉన్న సముద్ర తీరాన్ని టూరిజం కోసం అభివృద్ధి చేసే అంశంపై మంతనాలు జరిపారు. గత వైసీపీ ప్రభుత్వం టూరిజంపై ఎక్కువగా నజర్ పెట్టలేదు.. ఎన్డీయే కూటమి సర్కార్ టూరిజం అభివృద్ధికి తగిన సహకారం అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ నిధులు ఇస్తే.. ఏపీ మళ్లీ టూరిజం ఎట్రాక్షన్‌గా మారుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు.