Phone Tapping Issue: ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయాయి.. ఫోన్ ట్యాపింగ్ లాంటిది లేదని అంటూనే.. అసలు ట్యాపింగ్ చేస్తే వచ్చిన నష్టం ఏంటి? అంటూ కొందరు నేతలు ప్రశ్నించడం కూడా చర్చగా మారిపోయింది.. అయితే, ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. ఈ వ్యవహారంపై స్పందించారు.. ఎవరి ఫోన్ అయినా ట్యాపింగ్ చేసే అధికారం ప్రభుత్వాలకు లేదన్న ఆయన.. ఫోన్లు ట్యాపింగ్ చేస్తే ఇబ్బంది ఏంటని మంత్రులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు శ్రీనివాసరావు.
Read Also: Asaduddin Owaisi: త్రివర్ణ పతాకంలో ఆకుపచ్చ రంగును మోదీ ప్రభుత్వం తొలగిస్తుందా..?
మరోవైపు అదాని వ్యహారంపై పార్లమెంట్ లో వైసీపీ, టీడీపీ మౌనంగా ఉన్నాయని విమర్శించారు శ్రీనివాసరావు.. అదాని డొల్ల కంపెనీలు దేశ ఆర్థిక వ్యవస్థని దెబ్బతీశాయన్న ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ ఒత్తిడితోనే అదాని కంపెనీల్లో ఎస్బీఐ, ఎల్ఐసీ పెట్టుబడులు పెట్టాయని ఆరోపించారు. సంచలనంగా మారిన అదాని కుంభకోణంపై విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక, 2019 నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పు రెట్టింపు అయ్యిందని ఆందోళన వ్యక్తం చేశారు.. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి ప్రభుత్వం చేరుకుందని మండిపడ్డారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు. కాగా, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణను చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని వైసీపీ అధిష్టానం పక్కన పెట్టింది.. అంతేకాకుండా.. ఆయన ప్రతినిధ్యం వహిస్తోన్న నెల్లూరు రూరల్ అసెంబ్లీ స్థానానికి ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డిని ఇంచార్జ్‌గా పెట్టిన విషయం విదితమే.