CPI Ramakrishna: ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న ఆయన.. ఏపీలో జగన్ పాలనలో అన్నీ రివర్స్‌లో జరుగుతున్నాయని మండిపడ్డారు. ఎక్కడైనా చిన్న పార్టీలు, ప్రతిపక్షాలు ఉద్యమించడం చూశామని.. కానీ ఏపీలో వైసీపీనే ఉద్యమాలకు మద్దతు ఇవ్వడం దేనికి సంకేతమని సీపీఐ నేత రామకృష్ణ ప్రశ్నిస్తున్నారు. కర్నూలు వేదికగా రాయలసీమ గర్జనను వైసీపీనే ముందుండి నడిపిస్తుందని.. ఇది ప్రజలను దారుణంగా మోసం చేయడమేనని ఆయన ఆరోపించారు. ఏపీలో హైకోర్టులో అమరావతిలో పెడతామని సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు న్యాయరాజధానిగా కర్నూలును చేయాలంటూ నిర్వహిస్తున్న రాయలసీమ గర్జనకు ఎలా మద్దతు ఇస్తుందని రామకృష్ణ నిలదీశారు.
Read Also: Andhra Pradesh: నేడు రాయలసీమ గర్జన.. కర్నూలులో భారీ ర్యాలీ
రాయలసీమకు జగన్ చేసిందేమీ లేదని.. హంద్రీనీవా కాలువలను రెండింతలు వెడల్పు చేస్తామని చెప్పి కనీసం నీళ్లు ఇవ్వలేదని రామకృష్ణ విమర్శలు చేశారు. జగన్ హయాంలో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతున్నాయని ఎద్దేవా చేశారు. రూ.10 కోట్లు ఇవ్వాలని వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి బెదిరించడంతో రాయలసీమలో జాకీ పరిశ్రమ వెళ్లిపోయిందని.. అటు కియా పరిశ్రమ విస్తరణ మానుకుందని ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో అమరరాజా ఫ్యాక్టరీ విస్తరణ ఆపివేసి తెలంగాణకు వెళ్లిపోయిందని గుర్తుచేశారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతానన్న సీఎం జగన్ మూడోసారి శంకుస్థాపన చేసి 10 అడుగుల పని కూడా చేయలేదన్నారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఈనెల 9 నుంచి 13 వరకు సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టే పాదయాత్రకు అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నామని రామకృష్ణ అన్నారు.