Andhra Pradesh: ఏపీలో మూడు రాజధానుల రాజకీయం నడుస్తోంది. అభివృద్ధి వికేంద్రీకరణ చేసి తీరుతామని ప్రభుత్వం తెగేసి చెప్తోంది. ఈ నేపథ్యంలో మూడు రాజధానులకు మద్దతుగా ఈరోజు కర్నూలులో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో రాయలసీమ గర్జన సభ జరగనుంది. వైసీపీ మద్దతుతో ఈ సభను నాన్ పొలిటికల్ జేఏసీ భారీ ఎత్తున నిర్వహించనుంది. కర్నూలు ఎస్టీబీసీ మైదానంలో ఉదయం 10 గంటలకు జరిగే ఈ బహిరంగ సభకు సుమారు లక్ష మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజాప్రతినిధులు, 30 మంది ఎమ్మెల్యేలు, 10 మంది మంత్రులు ఈ సభకు హాజరుకానున్నారు.
Read Also: Bride Collapse: పెళ్లి వేడుకలో విషాదం.. వేదికపైనే కుప్పకూలిన వధువు
అభివృద్ధి వికేంద్రీకరణకు వైసీపీ మద్దతుతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గర్జనలు జరుగుతున్నాయి. ఇప్పటికే విశాఖలో భారీ సభ, ర్యాలీని ఏర్పాటు చేశారు. ఇప్పుడు అదే రీతిలో కర్నూలులోనూ భారీ ర్యాలీ, సభను నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. సోమవారం నాటి రాయలసీమ గర్జన సభ సందర్భంగా జిల్లాలో పలు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో సోమవారం జరగాల్సిన పీజీ, బీపీఈడీ, ఎంపీఈడీ రెండో సెమిస్టర్ పరీక్షలను ఈనెల 9వ తేదీకి వాయిదా వేశారు. కర్నూలు ఎస్పీ కార్యాలయంలో జరగాల్సిన స్పందన కార్యక్రమాన్ని కూడా రద్దు చేశారు. ఉమ్మడి కర్నూలుతో పాటు కడప, అనంతపురం జిల్లాల నుంచి వెయ్యి మంది పోలీసులకు గర్జన సభ బందోబస్తు విధులను అప్పగించారు. సభ ఏర్పాట్లలో కర్నూలు కార్పొరేషన్ కీలకంగా వ్యవహరిస్తోంది.