CM YS Jagan Serious Warning: 30 మంది వైసీపీ ఎమ్మెల్యేలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మళ్లీ సీరియస్ అయ్యారు. జూన్ 30లోపు పనితీరు మార్చుకోవాలని డెడ్ లైన్ విధించారు. లేదంటే ఆ నియోజకవర్గాల్లో కొత్త ఇంఛార్జ్ లను నియమించాల్సి వస్తుందంటూ సంబంధిత ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు.. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో గడప గడపకు కార్యక్రమంపై సోమవారం రోజు సీఎం వైఎస్ జగన్ సమీక్ష చేశారు. ఏ ఎమ్మెల్యే ఎన్నిరోజులు, ఎన్నిగంటలు పాల్గొన్నారనే లెక్కలనూ విశ్లేషించారు. టాప్-1లో కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఉన్నారు. అతి తక్కువగా కార్యక్రమం చేపట్టిన వారి జాబితాలో కొడాలి నాని, మంత్రి బుగ్గన, వసంత కృష్ణా ప్రసాద్ , సామినేని ఉదయ భానులు ఉన్నారు.
Read Also: Marriage: పెళ్లికోసం ఆస్పత్రి గదిని బుక్ చేశారు.. ఎందుకంటే?
దువ్వాడ శ్రీనివాస్ చేపట్టిన గడప గడపకు కార్యక్రమంపై సీఎం జగన్ ఆసక్తికర విశ్లేషణ చేశారు. ఒక సచివాలయాన్ని కవర్ చేయడానికి దువ్వాడ ఎనిమిది రోజులు తీసుకుంటున్నారన్నారు. ప్రతి గడపను టచ్ చేయమన్నానని.. మరీ అంత స్లోగా చేస్తే ఎలా అంటూ జగన్ చురకలంటించారు. నాలుగు రోజుల్లో సచివాలయంలో పరిధిలో గడప గడపకు కంప్లీట్ చేసేలా చూసుకోవాలని దువ్వాడకు సూచించారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను సీఎం జగన్ పరిచయం చేశారు. వారి గెలుపు కోసం పనిచేయాలని వైసీపీ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేల పనితీరుపై గత సమీక్షలోనూ జగన్ సీరియస్ అయ్యారు. లెక్కలేసి మరీ పనితీరు మార్చుకోవాలని సూచించారు. ఈసారి సమీక్షలోనూ జగన్ 30 మంది ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. జూన్ 30 లోపు పనితీరు మార్చుకోవాలని ,లేదంటే కొత్త ఇంచార్జ్ ల్ని పెట్టాల్సి వస్తుందని హెచ్చరించడం ఆసక్తికరంగా మారింది.. కాగా, గతంలోనూ కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు.. పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు.. అయినా.. ఇప్పటికీ కొందరిలో ఎంటా మార్పు రావడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.