మనం మరో ఏడాదిన్నరలో మళ్లీ ఎన్నికలకు వెళ్తున్నాం.. ఈ రోజు నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ అయిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆలూరు నుంచి వచ్చిన కార్యకర్తలను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు.. నియోజకవర్గంలోని ముఖ్యమైన కార్యకర్తలను కలుసుకోవాలన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశమన్న ఆయన.. గడప గడపకూ కార్యక్రమాన్ని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో చేపడుతున్నాం.. ఎమ్మెల్యేలు సంబంధిత నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు.. గ్రామంలో ప్రతి ఇంటికీ వెళ్తున్నారు.. ఈ మూడేళ్ల కాలంలో మనం చేసిన మంచి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్తున్నాం.. ఆ కుటుంబానికి జరిగిన మేలును వివరిస్తున్నాం.. ఆ మేలు జరిగిందా? లేదా? అనే విచారణ చేస్తున్నాం.. వారి ఆశీస్సులు తీసుకుంటున్నాం అన్నారు.
ఇక, ఎక్కడైనా పొరపాట్లు జరిగిఉంటే.. వాటిని రిపేరు చేస్తున్నాం అన్నారు సీఎం వైఎస్ జగన్.. ప్రభుత్వంలో ఉన్న మనం అంతా.. గ్రామ స్థాయిల్లో కూడా వివిధ బాధ్యతలను నిర్వహిస్తున్నాం.. అంతా కలిసికట్టుగా ఒక్కటి కావాలి.. అప్పుడే మంచి విజయాలు నమోదు చేస్తాం అని సూచించారు. అలాగే ప్రతి సచివాలయానికీ రూ.20 లక్షల రూపాయలు ప్రాధాన్యతా పనుల కోసం కేటాయిస్తున్నాం.. ఫలానా పని చేయడం వల్ల ప్రజలకు మేలు అనుకుంటే.. అది చేయాలి.. అత్యంత ప్రాధాన్యమైన పనులను ఈ నిధులు ద్వారా చేపడతామన్నారు.. గ్రామంలో 2 రోజుల పాటు కచ్చితంగా ఎమ్మెల్యే గడప గడపకూ కార్యక్రమం చేపడుతున్నారు.. కనీసం రోజూ 8 గంటల పాటు సమయం గడుపుతున్నారని తెలిపారు. సీఎంగా నేను ప్రతి కార్యకర్తకూ అందుబాటులో ఉండలేకపోవచ్చు.. అది సాధ్యం కాదు కూడా అన్నారు వైఎస్ జగన్.. కాకపోతే ప్రతి ఎమ్మెల్యే కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి.. ప్రతి గ్రామంలో రెండు రోజుల పాటు తిరగాలి.. రోజుకు 8 గంటలు గడపాలి.. సాధకబాధకాలు తెలుసుకుని.. వాటిని పరిష్కరించే ప్రయత్నం ఈ కార్యక్రమం ద్వారా సాగుతుందన్నారు. దేవుడి దయవల్ల గడప గడపకూ కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయన్న సీఎం.. వీలైనప్పుడు ప్రతి నియోజకవర్గం నుంచి కార్యకర్తలను కలుస్తున్నాం.. ఒక్క ఆలూరు నియోజకవర్గానికే వివిధ పథకాల ద్వారా ఈ మూడు ఏళ్ల కాలంలో రూ.1050 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేయడం జరిగిందని వెల్లడించారు.