CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘం అధికారులకు సచివాలయం మొదటి బ్లాక్ వద్ద సీఎం చంద్రబాబు స్వయంగా స్వాగతం పలికారు. ఇక, సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ఆర్థిక సంఘం ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పోలవరం- బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు లాంటి అంశాలపై ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు వివరిస్తూ వీడియో ప్రదర్శించి ఆర్థిక సంఘం బృందానికి వివరించారు సీఎం చంద్రబాబు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన ప్రత్యేక సాయం వంటి అంశాలపై ఫైనాన్స్ కమిషన్ బృందానికి ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు.
Read Also: Zaheer Khan: 46 ఏళ్ల వయసులో తండ్రైన జహీర్ ఖాన్!
ఇక, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు, స్వర్ణాంధ్ర విజన్- 2047, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు సీఎం చంద్రబాబు వివరిస్తున్నారు. విభజన అనంతరం రాష్ట్రం ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలు, తదనంతర పరిణామాలను వివరించారు. గత ఐదేళ్ల కాలంలో ఆర్థికంగా జరిగిన విధ్వంసం కారణంగా నేడు ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో కేంద్రం అదనపు సాయం చేయాలని సీఎం కోరనున్నారు. కేంద్రం తగిన విధంగా కేటాయింపులు చేసేలా ప్రతిపాదనలు ఇవ్వాలని 16వ ఆర్థిక సంఘాన్ని కోరనున్నారు. పనగారియా నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం బృందం నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు.