టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ 46 ఏళ్ల వయసులో తండ్రయ్యారు. జహీర్ సతీమణి, బాలీవుడ్ నటి సాగరిక ఘట్కే పండండి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఇద్దరు తమ ఇన్‌స్టా వేదికగా బుధవారం వెల్లడించారు. చిన్నారి ఫొటోని షేర్ చేసి.. ఫతేసిన్హ్ ఖాన్ అని పేరు పెట్టినట్లు తెలిపారు. జహీర్ ఖాన్ తన కుమారుడిని ఒడిలో పట్టుకుని ఉండగా.. సాగరిక తన చేతులను జహీర్ భుజాలపై ఉంచారు. జహీర్, సాగరిక జంటకు ఫాన్స్, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
2017 నవంబరులో జహీర్ ఖాన్, సాగరిక ఘట్కే ప్రేమ వివాహం చేసుకున్నారు. 2016లో మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ వివాహ వేడుకలో తొలిసారిగా జహీర్, సాగరిక జంటగా కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు. ఏడాది అనంతరం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తాను గర్భవతి అయిన విషయాన్ని సాగరిక ఇన్నాళ్లు సీక్రెట్‌గా ఉంచారు. ఈ రోజు చిన్నారి ఫొటో షేర్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు. జహీర్ భారత్ తరఫున 92 టెస్టులు, 200 వన్డేలు, 17 టీ20లు ఆడాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు మెంటార్‌గా ఉన్నాడు. మరోవైపు ‘చక్ దే ఇండియా’తో బాలీవుడ్‌కు పరిచమైన సాగరిక.. పలు హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించారు.