Peddireddy Ramachandra Reddy on Amit Shah: విశాఖపట్నంలో అమిత్ షా ఏపీ ప్రభుత్వం మీద చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్న క్రమంలో ఏపీ మంత్రులు అంతా అమిత్ షాను, బీజేపీని టార్గెట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పలువురు మంత్రులు విమర్శల వర్షం కురిపించగా ఇప్పుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉమ్మడి జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్, మైనారిటీ ఆత్మీయ సమ్మేళనం సభ నిర్వహించగా ఆ సభలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలు జరుగుతున్నాయని అన్నారు. సీఎం వైఎస్ జగన్ పేదలకు మంచి చేస్తే నచ్చని వాళ్ళందరూ కలుస్తున్నారని, పేదలకు మంచి చేసినందుకు అవినీతి ప్రభుత్వం అని బ్రాండ్ వేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
Also Read: Call Money Case: విజయనగరంలో బయటపడ్డ కాల్ మనీ కేసు..మరీ ఇంత అరాచకమా?
ఎన్టీ రామారావును మోసం చేసి పార్టీని, పార్టీ గుర్తును లాక్కున్నారని, వారంతా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారే తప్ప, ఎన్టీఆర్ టీడీపీ వారు ఎవరు లేరని అన్నారు. కొన్ని మీడియా ఛానెల్స్ ను అడ్డుపెట్టుకుని విష ప్రచారం చేస్తున్నారని, మొన్న శ్రీకాళహస్తిలో, నిన్న విశాఖలో అవినీతి ప్రభుత్వం అని విమర్శించారని కానీ అసలు అవినీతి టిడిపి హయాంలో జరిగిందని అన్నారు. మేము రెండు లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో వివిధ పథకాల ద్వారా చెల్లించామని, చంద్రబాబు కోవర్టులను బీజేపీకి పంపించి వైసీపీకి అవినీతిని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 20 పార్లమెంట్ సీట్లు గెలవాలని కొందరు అంటున్నారు కానీ వైసీపీ 25 ఎంపీ సీట్లు సాధిస్తుందని అన్నారు. గతంలో కంటే మరిన్ని ఎక్కువ సీట్లు సాధించి భారీ విజయం సాధిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.