Thota ChandraSekhar: వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారం ఇప్పుడు ఏపీ, తెలంగాణలో అధికార పార్టీల మధ్య కాకరేపుతోంది.. బిడ్డింగ్‌లో పాల్గొనే విషయంలో తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పర్యటిస్తోంది అధికారుల బృందం.. బిడ్‌కు సంబంధించిన సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తుండగా.. అసలు బిడ్‌లో పాల్గొంటే ప్రైవేటీకరణకు మద్దతు తెలిపినట్టే అంటోంది ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. దీనిపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్.. క్లారిటీ ఇచ్చారు. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం అని స్పష్టం చేశారు.. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రైవేటీకరణ త్వరగా చేయాలని చూస్తోందన్న ఆయన.. ఇంకా ఆలస్యం చేస్తే ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి వెళ్తుంది.. అదానీ కంపెనీలకు వైజాగ్ స్టీల్ వెళ్లేలా ఉందన్నారు.. అయితే, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆపడం లేదన్న ఆయన.. అలా వెళ్లకుండా ఉండాలంటే ఏమి చేయవచ్చు అని సాధ్యాసాధ్యలు పరిశీలించడానికి తెలంగాణ అధికారులు అక్కడికి వెళ్లినట్టు వెల్లడించారు.. బిడ్ లో ప్రభుత్వ రంగ సంస్థలు పాల్గొన కూడదని ఎక్కడా లేదన్నారు. బీజేపీతో ఉన్న రాజకీయ వైరుధ్యంతో బీఆర్‌ఎస్ బిడ్‌లో పాల్గొంటుందన్న విమర్శలను తిప్పికొట్టారు బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్.
Read Also: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
ఇక, ఎంతో చరిత్ర కలిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఓ క్రూరమైన చర్యగా గతంలోనే మండిపడ్డారు తోట చంద్రశేఖర్.. స్టీల్‌ప్లాంట్ రక్షణ బాధ్యత భారత రాష్ట్ర సమితిదేనన్నారు. రాజకీయ కుట్రలను అడ్డుకుని తీరుతామని, విశాఖ వాసులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. విశాఖలో చదువుకున్నానని, అప్పుట్లో స్టీల్ ప్లాంట్ ఉద్యమాలను కళ్లారా చూశానంటూ గుర్తు చేసుకున్నారు. విశాఖలోనే గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ చేశానని, ఐఏఎస్‌గా ఎంపికైందని ఇక్కడి నుంచేనన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ నష్టాల్లోకి నెట్టివేయబడిన సంస్థ, అలాంటి క్లిష్టమైన సమయంలో కార్మికులు కష్టపడి, చమటోడ్చి విశాఖ స్టీల్‌ప్లాంట్ ఆస్తులను రూ.3లక్షల కోట్లకు పెంచారన్నారు. కార్మికుల కష్టాన్ని కబ్జా చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అదానీకి కట్టబెట్టేందుకు బీజేపీ సర్కారు పావులు కదుపుతోందని, ప్రజల ఆస్తులను ప్రైవేట్ శక్తులకు అప్పగించాలని ప్రధాని మోడీ చూస్తున్నారని విమర్శించారు. ఇదేనా బీజేపీ సిద్ధాంతమంటూ గతంలోనే తోట చంద్రశేఖర్ ప్రశ్నించిన విషయం విదితమే.