Botsa Satyanarayana: అమరావతి సచివాలయంలో ఏపీ ఉద్యోగ సంఘాలతో సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని తెలిపారు. 62 ఏళ్ళకు పదవీ విరమణ అంశాన్ని గురుకుల టీచర్లు, కార్పొరేషన్లకు కూడా అమలు చేయాలని ఉద్యోగులు కోరారని.. న్యాయపరమైన చిక్కులు లేని సందర్భంలో సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పామని మంత్రి బొత్స చెప్పారు. ఈ సమావేశానికి సీపీఎస్ ఉద్యోగులను పిలవలేదన్నారు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల సమాచారం సీపీఎస్ భేటీగా సమాచారం వెళ్లిందని బొత్స పేర్కొన్నారు.
అటు ఈ సమావేశం వివరాలను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. జీపీఎస్, ఓపీఎస్ వంటి పదాల వల్ల కొంత ఇబ్బంది కలుగుతోందని.. వచ్చే సమావేశంలో పెన్షన్ అంశంపై చర్చ చేద్దామని ఉద్యోగులకు చెప్పామన్నారు. అయితే ప్రధాన ఉద్దేశ్యం అయితే ఒక్కటేనన్నారు. ఓపీఎస్ అయితే ఈ చర్చలు ఎందుకు అని ప్రశ్నించారు. పెన్షన్‌లో డీఆర్, ఫిట్‌మెంట్ వంటి అంశాలు సాధ్యం కాదన్నారు. గ్యారెంటీగా కొంత పెన్షన్ వచ్చే విధంగా నిర్ణయం ఉంటుందన్నారు. హెల్త్‌కు సంబంధించి కూడా ప్రయోజనాలు కల్పిస్తామని చెప్పామన్నారు. ఏదైనా చర్చల ద్వారానే సాధ్యం అవుతుందన్నారు. చర్చలకు రావటం మినహా ఉద్యోగులకు మరో ప్రత్యామ్నాయం లేదని సజ్జల అన్నారు. ఉద్యోగుల సమస్యల పట్ల తమకు చిత్తశుద్ధి ఉందన్నారు.
Read Also: Meta: మరో బాంబ్ పేల్చిన మెటా.. ఉద్యోగులకు భారీ షాక్?
ఉద్యోగుల అన్ని సమస్యలపై చర్చిస్తామని చెప్పడంతోనే తాము ఈరోజు జరిగిన సమావేశానికి హాజరయ్యామని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. వచ్చే సమావేశం నాటికి సీఎంతో చర్చించి ఉద్యోగుల పెన్షన్ కు సంబంధించి చర్చిద్దామన్నారని తెలిపారు. 11వ పీఆర్సీ పే స్కేలుకు సంబంధించిన వివరాలు వెంటనే అయా కార్యాలయాలకు పంపాలని కోరామన్నారు. ఉద్యోగుల రావాల్సిన బకాయిల చెల్లింపునకు రోడ్డు మ్యాప్ ఇవ్వాలని కోరామని.. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై సీఎంతో చర్చించి వచ్చే సమావేశంలో చెబుతామన్నారని వివరించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వివిధ ప్రభుత్వ పథకాల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరామని బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీంను బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. కొత్త జిల్లాలకు కూడా పాత జిల్లాల మాదిరిగానే హెచ్ఆర్ ఇవ్వాలని కోరినట్లు పేర్కొన్నారు.