Meta Employees Claim They Are Not Getting Promised Severance: చరిత్రలో ఎన్నడూ లేనంతగా.. మెటా సంస్థ ఏకంగా 11 వేల మంది ఉద్యోగుల్ని తొలగించిన విషయం అందరికీ తెలిసిందే! ఖర్చులు తగ్గించుకోవడానికి మరో దారి లేక, ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆ సంస్థ పేర్కొంది. అయితే.. ఇప్పుడు ఫైర్ చేసిన ఆ ఉద్యోగులకు మెటా సంస్థ మరో షాకిచ్చింది. సెవరన్స్ పే విషయంలో ముందుగా ఇచ్చిన హామీల వ్యవహారంలో.. మార్క్ జూకర్‌బర్గ్ వెనక్కు తగ్గినట్టు పలు నివేదికలు పేర్కొంటున్నాయి.
ఇంతకీ సెవరన్స్ పే అంటే ఏమిటి? ఒక ఉద్యోగిని హఠాత్తుగా తొలగించినప్పుడు.. రానున్న రోజుల్లో ఆ ఉద్యోగికి, అతని కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా సంస్థలు కొంత మొత్తాన్ని చెల్లిస్తాయి. మెటా సంస్థ కూడా.. తొలగించిన 11 వేల మంది ఉద్యోగులకు సెవరన్సు పే అందిస్తామని హామీ ఇచ్చింది. 16 వారాల బేస్ పేతో పాటు ప్రతి సంవత్సరం సర్వీస్‌కు రెండు అదనపు వారాల వేతనాన్ని అందిస్తామని చెప్పింది. అలాగే.. ఉద్యోగులకు, వారి కుటుంబాలకు 6 నెలల పాటు హెల్త్ ఇన్స్యూరెన్స్ అలవెన్స్‌లు వర్తిస్తాయని కూడా తెలిపింది. అయితే.. ఆ సెవరన్స్ పేను మెటా సంస్థ సగానికి కుదించినట్టు తెలిసింది. కేవలం 8 వారాల బేస్ పే, మూడు నెలల ఇన్సూరెన్స్ మాత్రమే ఇస్తోందని ఉద్యోగులు చెబుతున్నారు.
తామేమీ కాంట్రాక్ట్ ఉద్యోగులం కాదని, అయినా యాజమాన్యం తమ పట్ల ఎందుకిలా కఠినంగా వ్యవహరిస్తోందో అర్థం కావడం లేదని ఉద్యోగం కోల్పోయిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫైర్ చేసిన వారిలో కేవలం కొద్దిమందికి మాత్రమే జూకర్‌బర్గ్ బెనిఫిట్స్ ఇస్తున్నారని, మిగిలిన వారి పట్ల వివక్ష చూపుతున్నారని కూడా వాపోతున్నారు. మరోవైపు.. తక్కువ సెవరన్సు పే పొందిన ఉద్యోగుల గురించి సమాచారం కావాలని మెటా సీఈవో జూకర్‌బర్గ్ ఇతర ఎగ్జిక్యూటీవ్‌లకు లేఖ పంపినట్లు తెలిసింది. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అందులో పేర్కొన్నట్టు సమాచారం.