ఆంధ్రప్రదేశ్‌లో కొద్ది రోజుల్లోనే ఎన్నికల సమరం జరగనుంది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఉప ఎన్నికకు సంబంధించి మంగళవారంతో నామినేషన్ల పరిశీలన పూర్తి అయింది. మొత్తం 28 నామినేషన్‌లలో 13 మంది అభ్యర్థుల నామపత్రాలు తిరస్కరణకు గురయ్యాయని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఆత్మకూరు ఉప ఎన్నికకు ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ దూరంగా ఉండటంతో పోటీ ప్రధానంగా వైసీపీ, బీజేపీల మధ్యే ఉండనుంది. అధికార పార్టీ వైసీపీ అభ్యర్థిగా మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి బరిలోకి దిగారు. బీజేపీ అభ్యర్థిగా భరత్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు.
మరోవైపు ఆత్మకూరు ఉప ఎన్నిక కోసం వైసీపీ ఇన్‌ఛార్జులను నియమించింది. ఏఎంఎస్ పేట మండలానికి మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఆత్మకూరు రూరల్ మండలానికి మంత్రి కారుమూరు నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అనంతసాగరం మండలానికి మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చేజర్ల మండలానికి మంత్రి ఆర్కే రోజా, మాజీ మంత్రి కొడాలి నాని, ఆత్మకూరు పట్టణానికి మంత్రి అంజాద్ బాషా, ఎమ్మెల్యే గండికోట శ్రీకాంత్ రెడ్డి, మర్రిపాడు మండలానికి మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల్, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, సంగం మండలానికి మంత్రి నారాయణ స్వామి, ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఇన్‌ఛార్జులుగా వైసీపీ అధిష్టానం నియమించింది.