విజయనగరం రామతీర్థం బోడికొండపై జరిగిన పరిణామాలు చివరకు కేసుల వరకు వెళ్లాయి.. ఈవో ప్రసాద్ ఫిర్యాదు మేరకు నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌లో కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజుపై కేసు నమోదైంది.. 473, 353 సెక్షన్ల కింద అశోక్ గజపతిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. అయితే, ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అశోక్ గజపతి రాజు.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ఘటనలోకి టీడీపీ అధినేత చంద్రబాబును లాగడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.. మంత్రులను గౌరవిస్తాం.. కానీ, ఊడిగం చేయలేం అన్నారు. ఈవోలతో కేసులు పెట్టించడం కొత్త అలవాటుగా మారిందని ఫైర్ అయిన ఆయన.. దేవాదాయశాఖలో ఆచార సాంప్రదాయాలు తప్ప ప్రోటోకాల్ అనే పదం ఉండదని.. అరెస్టులు, కేసులు, బెదిరింపులు నాకు కొత్త కాదు… హిందూ ధర్మకోసం ఊపిరి ఆగేవరకు పోరాడుతానని ప్రకటించారు. దేవాలయాలకు దేవుడే ఓనర్.. గర్భగుడి దగ్గర శిలాఫలకాలు ఎలా ఉంటాయి అని ప్రశ్నించిన ఆయన.. విధులకు ఆటంకం కలిగించామని కేసులు పెట్టడం కొత్త సంప్రదాయమని.. కేసులకు నేను భయపడను.. హిందూ మతంను కాపాడడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు.
మంత్రులు ఆలోచనలు, భాష గురించి నేను స్పందించలేను అంటూ పరోక్షంగా సెటైర్లు వేశారు అశోక్‌గజపతిరాజు.. నా కుటుంబం దేశద్రోహుల కుటుంబం అని జిల్లా మంత్రి అన్నారని.. నిన్న మా తల్లిదండ్రులు పెంపకం గురించి మాట్లాడారని.. అనువంశిక ధర్మకర్తలను ప్రభుత్వాలు నియమించవు… సాంప్రదాయాల ప్రకారం అనువంశికంగా వస్తాయన్నారు. రాష్ట్రంలో అనువంశిక ధర్మకర్తలు 230 మంది మాత్రమే వున్నారు.. దేవుడి పేరుతో మేనేజ్‌మెంట్ చేసేది ధర్మకర్తలే అన్నారు. దేవాలయాలు ఆస్తులను ఇతర ప్రభుత్వ అవసరాలకు వాడటం కుదరదని స్పష్టం చేసిన ఆయన.. వాహన మిత్ర కోసం కామన్ గుడ్ ఫండ్ కేటాయించారు… అటువంటి కేటాయింపులు చెల్లవు అన్నారు. దేవాదాయశాఖ మంత్రి మాట్లాడే భాష నేను మాట్లాడను.. ముఖ్యమంత్రి లేదా మంత్రి సంతకం పెట్టకుండా జీవోలు ఏ విధంగా జారీ అవుతాయని ప్రశ్నించిన అశోక్ గజపతి.. అనువంశిక ధర్మకర్తలను సహించలేని దుస్థితి ఉందన్నారు. రామతీర్ధాలు శంకుస్థాపన ముహూర్తం ప్రభుత్వం నిర్ణయించింది… సాంప్రదాయాలు, ఆచారాలు ప్రకారం చేయాల్సిన పూజల కోసం నాకు ఆఖరి నిముషంలో చెప్పారన్న ఆయన.. హిందువుల డబ్బుతో ఆలయ పునఃనిర్మాణం కోసం ప్లానింగ్ చేయడానికి ప్రభుత్వానికి ఏడాది పట్టిందని ఎద్దేవా చేశారు.
ఇక, ప్రభుత్వం నన్ను టార్గెట్ చేసిందని విమర్శించారు అశోక్ గజపతిరాజు.. వ్యక్తిగతంగా నన్ను ఇబ్బంది పెట్టడానికి అనువంశిక వ్యవస్థను దెబ్బతీయడానికా…!? అని ప్రశ్నించిన ఆయన.. సింహాచలం దేవస్థానం చైర్మన్‌గా పునర్ నియామకం తర్వాత 40 రోజులకు ఒక కారు పంపించారు… కారు నిర్వహణపై క్లారిటీ ఇవ్వలేదు… అందుకే వాడటం లేదన్నారు. మరోవైపు మాన్సాస్ ట్రస్ట్ జీతాలు అడిగినందుకు పోలీసు కేసు పెట్టారు.. పవిత్రమైన రామతీర్థంలో షూస్ వేసుకుని పూజలకు హాజరయ్యారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. నా వయసులో సగం ఉన్న దేవాదాయశాఖ మంత్రి రామతీర్థంలో ఇష్టానుసారంగా వ్యవహరించారని మండిపడ్డారు. కొబ్బరి కాయ కొట్టడానికి కూడా నన్ను భౌతికంగా అడ్డుకున్నారు.. నాకు ఎండో మెంట్ అధికారులు మర్యాద చేయడాన్ని మంత్రి వెల్లంపల్లి సహించలేకపోయారని.. నాకు ఎన్ని అవమానాలు జరిగినా సహిస్తాను… అనువంశిక ధర్మకర్తగా సాంప్రదాయాలను పాటించాల్సిన బాధ్యత మా మీదే ఉందన్నారు. భక్తుల డబ్బుపై ప్రభుత్వానికి పెత్తనం ఏంటి…!? అని ప్రశ్నించిన గజపతిరాజు.. సాంప్రదాయాలు, పద్ధతులు పాటించకపోవడాన్ని సర్కస్ అనకపోతే ఏమి అనాలి…!? అని ఎద్దేవా చేశారు.. అనువంశిక ధర్మకర్తను అడ్డుకున్నందుకు మంత్రిపై చర్య తీసుకోవాలి… ఆ పని చేయగలుగుతారా…!? అని నిలదీసిన ఆయన.. రామతీర్థం వివాదంలో చంద్రబాబును లాగుతున్నారు… చంద్రబాబు చెప్పినట్టు చేయడానికి నేనేమైన ఆయన పీఏనా…!? అని ప్రశ్నించారు.